కౌన్సిలింగ్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ
కేంద్రం, ఎన్‌ఎటికి నోటీసులు జారీ
న్యూఢిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ప్రశ్నాపత్రం లీకయిన కారణంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) అండర్‌గ్రాడ్యుయేట్(యుజి) పరీక్ష-2024ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) మే 5వ తేదీన నీట్-యుజి పరీక్షను నిర్వహించింది. జూన్ 4న పరీక్షా ఫలితాలు వెలువడడంతో పరీక్షల్లో విజేతలైన అభ్యర్థులకు ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, సంబంధిత ఇతర కోర్సులలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రారంభం కావలసి ఉంది.
నీట్ పరీక్ష లీకైందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ శివంగి మిశ్రాతోపాటు ఇతర వైద్య ప్రవేశ ఆశావహులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ కేంద్రానికి, ఎన్‌టిఎకి నోటీసులు జారీచేసింది. నీట్ 2024 పరీక్షను రద్దు చేయాలని మిశ్రా తన పిటిషన్‌లో అర్థించగా అది అంత సులభం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. నీట్ పరీక్షను పరమ పవిత్రంగా చేశారని, ఇప్పుడు దాని పవిత్రత దెబ్బతిందని, ముందుగా తమకు సమాధానాలు కావాలని జస్టిస్ అమానుల్లా ఎన్‌టిఎ తరఫు న్యాయవాదికి తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పదేపదే కౌన్సిలింగ్ నిలుపుదల కోసం కోరగా అందుకు ధర్మాసనం తిరస్కరించింది. కౌన్సిలింగ్‌ను ఆపే ప్రసక్తి లేదని, ఇదే విధంగా వాదిస్తే పిటిషన్‌ను కొట్టివేస్తామని పిటిషనర్ తరఫు న్యావాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కేసు తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, నీట్-యుజి 2024 ఫలితాల ప్రచురణపై స్టే విధించడానికి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ మే 17న నిరాకరించారు. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌కు జవాబు ఇవ్వాలని కేంద్రానికి, ఎన్‌టిఎకు నోటీసులు జారీచేసిన సిజెఐ ఈ కేసు విచారణను జులైకు వాయిదా వేశారు. ఇప్పుడు ఈ రెండు పిటిషన్లపై విచారణ జరుగుతుంది. పిటిషనర్ల తరఫున న్యాయవాది మాథ్యూస్ నెడుంపరా వాదిస్తూ నీట్ యుజి అడ్డిషన్ల కౌన్సిలింగ్ నిలిపివేయాలని కోరారు. దీన్ని తిరస్కరించిన ధర్మాసనం కౌన్సిలింగ్ ప్రారంభం కావలసిందేనని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ వల్ల నిజాయితీగా పరీక్షను రాసిన అభ్యర్థులు నష్టపోగా కొందరు అభ్యర్థులు లబ్ధిపొందారని పిటిషనర్లు వాదించారు.