Friday, December 20, 2024

రేపు ఇటలీకి ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

మూడో హయాంలో తొలి విదేశీ పర్యటన
15 వరకు జి7 శిఖరాగ్ర సదస్సు
ఉక్రెయిన్, గాజా సంక్షోభాలపై చర్చకు అవకాశం
14 రాత్రి తిరిగి రానున్న మోడీ

న్యూఢిల్లీ : జి7 ఆర్థిక వ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం ఇటలీ వెళ్లనున్నారు. వరుసగా మూడవ పర్యాయం ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మోడీ జరపనున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఇటలీ అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నజియాలగ్జరీ రిసార్ట్‌లో గురువారం (13) నుంచి 15 వరకు జి7 సమ్మిట్ జరగనున్నది. ఉక్రెయిన్‌లో ఉద్ధృతంగా సాగుతున్న యుద్ధం, గాజాలో పోరుపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సదస్సుకు హాజరు కానున్న అగ్ర నేతల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఉన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణపై జరిగే సెషన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా హాజరు కానున్నారు. ప్రధాని మోడీ గురువారం ఇటలీకి బయలుదేరి వెళతారని, శుక్రవారం (14న) రాత్రి తిరిగి వస్తారని ఆయన పర్యటన సమాచారం ఉన్న వ్యక్తులు తెలిపారు.

అయితే, మోడీ ఇటలీ పర్యటనపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మోడీ వెంట ఉన్నత స్థాయి ప్రతినిధివర్గంవెళుతుందని, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ ఆ బృందంలో ఉండవచ్చునని అభిజ్ఞ వర్గాలు సూచించాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సహా కొందరు అగ్ర నేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. నిరుడు మేలో హిరోషిమాలో జరిగిన గత జి7 సమ్మిట్‌కు మోడీ హాజరయ్యారు. జి7లో యుఎస్, యుకె, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. ఇటలీ ప్రస్తుతం జి7కు అధ్యక్ష హోదాలో ఉన్నది. ఆ హోదాతోనే ఇప్పుడు సమ్మిట్‌ను ఇటలీ నిర్వహిస్తోంది. సంప్రదాయం ప్రకారం, భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో 11 వర్ధమాన దేశాల అధినేతలను ఇటలీ ఆహ్వానించింది. యూరోపియన్ యూనియన్ జి7లో సభ్యత్వం లేకపోయినప్పటికీ వార్షిక సమ్మిట్‌కు హాజరు అవుతుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News