Monday, December 23, 2024

ఇక దేశవ్యాప్తంగా సంస్థాగత మార్పులు

- Advertisement -
- Advertisement -

అనేక రాష్ట్రాలకు బిజెపి కొత్త అధ్యక్షులు
నడ్డా స్థానంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపిక

న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి సారథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా కమలం పార్టీ ఇక సంస్థాగత మార్పులపై దృష్టి సారించనున్నది. మొదట దేశవ్యాప్తంగా సభ్యత నమోదును చేపట్టి ఆ తర్వాత రాష్ట్రాలలో అంతర్గత ఎన్నికలను పూర్తి చేసి ఆ తర్వాత రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల ఎన్నికలను నిర్వహించనున్నది. బిజెపి ప్రస్తుత అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలం జూన్ 30తో ముగియనున్నది. కాగా..అత్యవసర పరిస్థితులలో అధ్యక్షుడు పదవీ కాలానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని పార్టీ అత్యున్నత విభాగం పార్లమెంటరీ బోర్డుకు అప్పగిస్తూ బిజెపి నియమావళిలో ఇటీవల సరవణలు తీసుకువచ్చారు. తన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యేవరకు నడ్డాను కొనసాగిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

అయితే తుది నిర్ణయం పార్టీ అగ్రనేతలపైనే ఆధారపడి ఉంటుందని వారు చెప్పారు. నడ్డాను కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖలను కేటాయించడంతో ఆయన వారసుడి కోసం అన్వేషణ పార్టీలో మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిజెపి అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. ఆయన కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ నియమించింది. అనంతరం 2020 జనవరిలో ఆయన పూర్తికాలం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ కొత్త సాంప్రదాయాన్ని అనుసరించే ఇప్పుడు కూడా పూర్తికాలం అధ్యక్షుడి నియామకం జరిగే వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోడీ 2019లో రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు పార్టీ సంస్థాగత వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారన్న ఆలోచనతోనే నడ్డాను తన మంత్రివర్గం నుంచి తప్పించారు. అయితే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయగల అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీ నాయకత్వానికి సవాలుగా మారింది. పార్టీకి సారథ్యం వహించగల సమర్థులుగా భావించిన ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ తాగాజా మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టారు.

దీంతో రాష్ట్రాలకు చెందిన నాయకులనో లేక జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఒకరినో పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసే అవకాశం కనపడుతోంది. కొందరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కించుకోవడం, ఉత్తర్ ప్రదేశ్ వంటి కీలక రాష్ట్రంలో పార్టీకి ఇటీవలి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో రాష్ట్ర అధ్యక్షులుగా కొత్త వారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ బిజెపి అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని రాష్ట్రంలో పారీ సారథిగా కూడా ఉన్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిపి జోసి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సామాజిక సమతుత్యత కోసం అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి తగిలిన ఎదురుదెబ్బ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూసేంద్ర సింగ్ చౌదరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంపై దృష్టంతా నిమగ్నం చేయడంతో సంస్థాగత ఎన్నికలను, మార్పులను తాత్కాలికంగా పార్టీ పక్కనపెట్టినట్లు వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మోడీ 3.0 కూడా కొలువుదీరిన నేపథ్యంలో వెంటనే సంస్థాగత వ్యవహారాలపై పార్టీ అగ్ర నాయకత్వం దృష్టి సారించనున్నట్లు వారు చెప్పారు. లోక్‌సభలో బిజెపి మెజారిటీని కోల్పోయినప్పటికీ ఎన్‌డిఎ మిత్రపక్షాలతో కలసి 272 మెజారిటీ మార్కును సులభంగానే దాటేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News