Sunday, November 17, 2024

పార్లమెంట్ వాక్బలం ప్రదర్శన స్థలం

- Advertisement -
- Advertisement -

కండ బలానికి కాదు
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కొత్త మంత్రి రిజిజు

న్యూఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొత్తగా నియుక్తుడైన కిరణ్ రిజిజు మంగళవారం అధికార బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ ఉన్నది వాక్బలం ప్రదర్శించడానికే కాని కండ బలానికి కాదని రిజిజు తన తొలి సందేశంలో సూచించారు. ప్రహ్లాద్ జోషి నుంచి ఈ కీలక మంత్రిత్వశాఖను స్వీకరించిన రిజిజు పార్లమెంట్‌లో కార్యకలాపాలు సాఫీగా నిర్వహించేందుకు, దేశ ప్రయోజనాల కోసం చట్టాలు చేసేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళుతుందని తెలిపారు. ‘బిల్లులను ఆమోదించవలసిఉంది. మొత్తం ప్రతిపక్షం మద్దతు కోసం అభ్యర్థిస్తున్నాను’ అని రిజిజు చెప్పారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ నుంచి పదే పదే ఆరోపణలకు గురైన ప్రతిపక్షానికి రిజిజు ఒక సందేశం ఇస్తూ, పార్లమెంట్ ఉన్నది వాక్బలం ప్రదర్శనకే గాని కండ బలం చూపేందుకు కాదని స్పష్టం చేశారు.

కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యుల అధికార ప్రమాణ స్వీకారం నిమిత్తం పార్లమెంట్ సమావేశాలను త్వరలో నిర్వహించనున్నామని, సమావేశాలకు తేదీలను ఇంకా నిర్ణయించలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కొత్త మంత్రి తెలియజేశారు. సభ్యుల ప్రమాణ స్వీకారం నిమిత్తం సంక్షిప్త సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఆ సమావేశాలను ప్రో టెమ్ స్పీకర్ పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. సాధారణంగా లోక్‌సభలో అత్యంత సీనియర్ సభ్యుడు ప్రో టెమ్ స్పీకర్‌గా వ్యవహరిస్తారు. సమావేశాల ఏర్పాటు తరువాత లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని సమాధానం ఇవ్వడంతో సంక్షిప్త సమావేశాలు ముగుస్తాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్ లోక్‌సభలో అత్యంత సీనియర్ సభ్యుడు.

కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షకూటమి అధిక సంఖ్యా బలంతో లోక్‌సభకు తిరిగి వచ్చినందున పార్లమెంట్‌ను సాఫీగానడపడంరిజిజుకు కష్టం కావచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బిజెపికి 272 ఎంపిల సాధారణ మెజారిటీని సాధించలేకపోయింది. బిజెపి సొంతంగా 240 ఎంపిలతో పరిమితం అయింది. లోక్‌సభలో మెజారిటీ కోసం బిజెపి ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడవలసి రావచ్చు. కాంగ్రెస్ 99 మంది ఎంపిలతో లోక్‌సభలోఅతి పెద్ద ప్రతిపక్షం.ఈ పర్యాయం కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని స్థానం కోసం అధికార గుర్తింపు కూడా లభిస్తుంది.

తగిన సంఖ్యా బలం లేనందున 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆ హోదా దక్కలేదు. ఈ దఫా రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కావచ్చు. ఆ బాధ్యతలు స్వీకరించవలసిందని రాహుల్‌కు కాంగ్రెస్ కార్యవర్గం ఇటీవలి సమావేశంలో విజ్ఞప్తి చేసింది. ఇది ఇలా ఉండగా, స్టాక్ మార్కెట్ కుంభకోణంగా పేర్కొంటున్న వ్యవహారంపై జెపిసి ఏర్పాటుకు కాంగ్రెస్ చేసిన డిమాండ్‌పై వ్యాఖ్యానించవలసిందని కోరినప్పుడు, ‘ఈ అంశాలపై తరువాత చర్చించవచ్చు. ఈ రోజు అందుకు సందర్భం కాదు. నేను సకారాత్మకంగా బాధ్యతలు ప్రారంభించాలని కోరుకుంటున్నాను’ అని రిజిజు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News