Monday, December 23, 2024

కూటమి ప్రభుత్వానికి సహకరిస్తాం: షర్మిల

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి సహకారం అందిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.
చారిత్రాత్మకమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా, గడిచిన వారంరోజుల్లో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండీ, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు డా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు తనను ఎంతగానో కలచివేశాయన్నారు. వారు చేసారని మీరు, మీరు చేసారని భవిష్యతులో మళ్ళీ వాళ్ళు, ఇలా ఈ పగలకు, ప్రతీకారాలు అంతు ఉండదు, సభ్యసమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు లేదు, ఉండకూడదన్నారు.

ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో, ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు, అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని తెలిపారు.గడచిన ఐదేండ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోపెట్టి ముందుకు తీసుకునివెళతారని ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని, దానికి అనుగుణంగా నడుచుకుని, వైస్సార్ గారి విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. అనుభవముతో, మీరు పెద్దమనసు, నిస్పాక్షికత చూపుతూ, పరిస్థితులను చక్కదిద్దుతారని అనుకుంటున్నామన్నారు. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు, సంస్కారం, విచక్షణకు తావులేని చేష్టలతో మీ పేరుకు, ప్రతిష్టకు, పాలనకు మచ్చ రాకూడదని కోరుకుంటున్నామన్నారు.

అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ఇతర మంత్రులందరికీ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News