Thursday, October 24, 2024

ప్రతీకార రాజకీయాలు మాకు అలవాటు లేదు:సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

తాను కాని, తన ప్రభుత్వం కాని ప్రతీకార రాజకీయాలకు పాల్పడలేదని, భవిష్యత్తులో కూడా పాల్పడబోమని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. అటువం టి రాజకీయాలు చేసేది బిజెపి మాత్రమేనని ఆయన ఆరోపించారు.పోక్సో కేసులో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్పపై అరెస్టు వారెంట్ జారీకావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ బిజెపి, జెడియు చేస్తున్న ఆరోపణలను శుక్రవారం ఆయన ఖండించారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుటుంబాన్ని టార్గెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎడియూరప్ప కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందంటూ కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. శుక్రవారం నాడిక్కడ సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడుతూ తమపై వారు(బిజెపి) కేసులు నమోదు చేసినపుడు అది టార్గెట్ చేయడం కాదా అని ప్రశ్నించారు. తనపైన, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌పైన, తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపైన కేసులు నమోదు చేయడాన్ని ఏమంటారని ఆయన ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఏమని అంటారని ముఖ్యమంత్రి బిజెపిని నిలదీశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపించారు. దాన్ని విద్వేష రాజకీయాలు అంటారా? లేక ప్రేమ రాజకీయాలు అంటారా? కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడేది వాళ్లు. మేమెప్పుడూ అలాంటి రాజకీయాలు చేయము. నేనైతే ఇప్పటి వరకు అలాంటివి చేయలేదు. నేను నిన్న, మొన్న రాజకీయాల్లోకి రాలేదు. అది(కక్షసాధింపు రాజకీయాలు) బిజెపి పని అని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. కేంద్ర క్యాబినెట్‌లోకి దక్షిణాది రాష్ట్రాల నుంచి 8 మందిని చేర్చుకోవడం దక్షణాదిలో బిజెపిని విస్తరించే పథకంలో భాగమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు వారేం చేసినా దక్షిణ భారతదేశం బిజెపిని నమ్మదని, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ ముసుగులో బిజెపికావడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర భారతంలో కూడా బిజెపికి ఎదురుడెబ్బ తగిలిందని ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలో ఆ పార్టీ అపజయాలను చవిచూసిందని సిద్దరామయ్య అన్నారు. బిజెపి అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారని ఒక ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు అన్నారని ఆయన చెప్పారు. కక్షసాధింపు రాజకీయాలు బిజెపికి అలవాటైన విద్యేనని ఆయన విమర్శించారు.

ఇడి, సిబిఐ, ఐటి పేరిట బెదిరింపులకు పాల్పడడం బిజెపి మొదటి నుంచి చేస్తోందని, ఇప్పుడు కూడా అదే పని చేస్తోందని, అందుకే ప్రజలు ఆ పార్టీకి ఈసారి మెజారిటీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పారు. నీట్ పరీక్ష వివాదాన్ని గురించి ప్రశ్నించగా కష్టపడి చదివిని విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. దానిపై దర్యాప్తు జరగాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. పరీక్షలను ఎన్‌టిఎ సక్రమంగా నిర్వహించలేదని, గ్రేస్ మార్కులు ఇవ్వడం మంచి సంప్రదాయం కాదని, గ్రేస్ మార్కులతో విద్యార్థులను పాస్ చేయడం మంచి పద్ధతి కాదని ఆయన చెప్పారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలను సాధ్యమైనంత త్వరలో నిర్వహిస్తామని ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News