Sunday, December 22, 2024

17న సిఐడి ఎదుట హాజరవుతా: ఎడియూరప్ప

- Advertisement -
- Advertisement -

తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి జూన్ 17న(సోమవారం) దర్యాప్తు కోసం సిఐడి ఎదుట హాజరవుతానని బిజెపి సీనియర్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్ప శనివారం తెలిపారు. శనివారం బెంగళూరు చేరుకున్న ఎడియూరప్ప విలేకరులతో మాట్లాడుతూ తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారికి ప్రజలు గుణపాఠం నేర్పుతారని అన్నారు. పోక్సో కేసులో ఎడియూరప్ప అరెస్టును నిలుపుదల చేస్తూ కర్నాటక హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే జూన్ 17న దర్యాప్తు నిమిత్తం సిఐడి ఎదుట హాజరు కావాలని ఎడియూరప్పను హైకోర్టు ఆదేశించింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కోసం నేను ఢిల్లీకి వెళ్లాను. జూన్ 17న దర్యాప్తు కోసం హాజరవుతానని ముందుగానే లిఖితపూర్వకంగా సమాచారం అందచేశాను. సిఐడి నన్ను అరెస్టు చేయకుండా హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం సిఐడి ఎదుట హాజరవుతాను. గందరగోళం సృష్టించడానికి కొందరు అనవసరంగా ప్రయత్నించారు.

ఎవరినీ నిందించదలచుకోలేదు. అందరికీ వస్తావం ఏమిటో తెలుసు అని ఎడియూరప్ప తెలిపారు. నాకు వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడేవారికి ప్రజలు గుణపాఠం చెబుతారు అని కూడా ఆయన హెచ్చరించారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద ఈ ఏడాది మార్చి 14న ఎడియూరప్పపై కేసు నమోదైంది. ఈ నెల 12న (బుధవారం) తమ ఎదుట హాజరుకవాలని సమన్లు జారీచేసినప్పటికీ ఎడియూరప్ప గైర్హాజరు కావడంతో ఆయనపై అరెస్టు వారెంట్ జారీచేయాలని కోరుతూ సిఐడికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం కోర్టు ఎడియూరప్పపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. తన 17 ఏళ్ల మైనర్ కుమార్తెపై ఈ ఏడాది ఫిబ్రవరి 2న బెంగళూరులోని డాలర్ల కాలనీ నివాసంలో ఎడియూరప్ప లైంగిక దాడి జరిపినట్లు ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసును నమోదు చేయగా కర్నాటక డిజిపి ఆదేశం మేరకు ఈ కేసును సిఐబికి బదిలీ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖడించిన ఎడియూరప్ప ఈ కేసును తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.

ముందస్తు జామీనుతోపాటు ఎప్‌ఐఆర్‌ని కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఎడియూరప్పపై ఆరోపణలు చేసిన ఆ 53 సంవత్సరాల మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. కాగా..మార్చి 14న కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదని ఆరోపిస్తూ బాధితురాలి సోదరుడు గత ఆరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎడియూరప్పను అరెస్టు చేసి ప్రశ్నించడానికి పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News