మన తెలంగాణ/హైదరాబాద్: గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పోడు భూము ల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధ ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై సమగ్ర నివేదికను సమర్పించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పో డు భూముల రక్షణకు కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదే సమయంలో పోడు భూముల్లో సాగుచేసుకుంటున్న రైతు కు టుంబాలు సున్నితమైన పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని, క్ర మశిక్షణా చర్యలకు గురికావద్దని సూచించారు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యం లో పోడు భూముల సమస్యలపై శనివారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, డిప్యూటీ సెక్రటరీ శ్రీలక్ష్మి, పిసిసిఎఫ్ డోబ్రియాల్, సిసిఎఫ్‌లు భీమా నాయక్, ప్రభాకర్, డిఎఫ్‌ఓలు రాహుల్ కిషన్ యాదవ్, కిష్టాగౌడ్, సిద్దార్థ్ విక్రంసింగ్, విశాల్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో మంత్రి సురేఖ మాట్లాడుతూ పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతుల హక్కులను కాపాడడంలోనూ, అటవీశాఖ భూములను కాపాడే విధులను నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి కొన్నేళ్ళుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లైతే కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్‌ఆర్‌ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్‌లపై శుక్రవారం గిరిజనులు చేసిన దాడిని మంత్రి సురేఖ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెదకాలని మంత్రి సీతక్క నాతో పలుమార్లు ప్రస్తావించారని తెలిపారు. పోడు భూముల విషయంలో అటవీశాఖకు, రైతులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలను నివారించేలా చర్యలు చేపట్టాలని, మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ వచ్చారని వివరించారు. వీరి మధ్య జరిగే సంఘర్షణలతో ప్రభుత్వానికి మచ్చ రావద్దనే ఆలోచనతో ఈ సమస్యలకు పరిష్కారం వెదికేందుకు ప్రాథమికంగా నేడు సమావేశమైనట్లు స్పష్టం చేశారు. ఏళ్ళుగా కొనసాగుతున్న పోడు భూముల చిక్కు సమస్యను పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశాన్ని ప్రాథమిక సమావేశంగా భావిస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు.
పోడు సమస్యల్లో భాగంగా ఫైరింగ్‌కు దిగొద్దుః మంత్రి సీతక్క
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క మాట్లాడుతూ తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పోడు భూములపై వివాదాలను చూస్తూనే ఉన్నానని మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్న నేపథ్యంలో ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాల్లో పోడు భూముల సమస్యను లేవనెత్తి, కచ్చితమైన పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో అటవీశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సీతక్క సూచించారు.
అటవీ భూములను కాపాడుకుంటూనే, పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి వారికి ప్రయోజనాలను కలిగించాలని సూచించారు. సీతక్క అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అటవీ భూములను సంరక్షించి అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలియ్యాలని కోరారు. అటవీ భూముల్లో గోతులు తవ్వితే సరిపోదని, అక్కడ చెక్ డ్యాములు కడితే, పశువులు అడవి జంతువులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులను సరి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, పోడు పట్టాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఆదివాసీలు, అటవీ సిబ్బంది మధ్య ఘర్షణలు లేకుండా చూడడంతో పాటు కేసులతో బెదిరించకుండా, అటవీ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
మానవీయ కోణంలో పోడు సమస్యలను పరిష్కరించాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫైరింగ్‌కు దిగోద్దని అటవీ అధికారులను కోరారు. వివాదం వున్న పోడు భూముల్లో పండ్ల సాగును పెంచాలని, ఆ పండ్లను అమ్ముకునే హక్కును స్థానికులకే కల్పించాలని తెలిపారు. చేతులు మారిన పోడు భూముల పై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఫారెస్ట్ డెవలప్ మెంట కార్పోరేషన్ ఆధ్వర్యంలో పలు రకాల మొక్కలను పెంచడం, పామాయిల్ చెట్లను సాగు చేయడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా పోడు రైతులకు ప్రయోజనాలను కలిగిస్తూనే ప్రభుత్వ లక్ష్యాలను సాధించవచ్చునని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.
ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఛత్తీసగఢ్ నుంచి రాష్ట్రంలోని వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. దీనికి మంత్రులు స్పందిస్తూ, పక్క రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని, భవిష్యత్ లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి అని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. భూ ఆక్రమణలను వందకు వందశాతం నిలువరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు వందకు వంద శాతం కొనసాగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.
అటవీశాఖ తమ భూములను లాక్కుంటుందనే పోడు రైతుల భ్రమలను తొలిగించేలా వారిలో నమ్మకాన్ని కలిగించేలా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గిరిజన సంక్షేమ శాఖలతో నిరంతరం చర్చిస్తూ, సమావేశమవుతూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా కార్యాచరణను అమలుపరచాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు మంత్ర సురేఖ సూచించారు. పోడు భూములతో ముడిపడి ఉన్న అన్ని శాఖలను నిరంతరం సమీక్షిస్తూ ఈ దిశగా కచ్చితమైన మార్గదర్శకాలకు త్వరలో రూపం ఇవ్వాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.
పచ్చదనం పెంపునకు అన్ని రకాల మొక్కలూ నాటాలి
ఈ సమావేశంలో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో పచ్చదనం పెంపుదలలో భాగంగా చేపట్టాల్సిన కార్యకలాపాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపుదలలో అన్ని రకాల మొక్కలను నాటాలని, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుని ఈ దిశగా చర్చలు జరపాలని సూచించారు. -వేప, బొడ్డు మల్లె, గంగరేగు, కుంకుడు, చీమ చింతకాయ, సీతాఫలం, రావి వంటి చెట్లు, అటు నీడనివ్వడంతో పాటు అటవీ జంతువుల అవసరాలను తీర్చే మొక్కలను ఎక్కువగా నాటాలని మంత్రి సురేఖ అధికారులకు స్పష్టం చేశారు.
వేగంగా పెరిగే మొక్కలను నాటడంతో పాటు చెట్లు విస్తరిస్తూ, కరెంట్ తీగలకు తగలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీశాఖ నర్సరీల్లో చాలా మొక్కలు అందుబాటులో ఉన్నందున ఈ మొక్కలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. బయట నుంచి మొక్కలు కొనకుండా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కానున్న శాఖలకు సర్క్యులర్ జారీ చేయాలని తెలిపారు. గతంలో మొక్కలు నాటేందుకు గుంతలను ట్రాక్టర్లతో తీసినందున చాలా వరకు మొక్కలు వేళ్ళు విస్తరించక చనిపోయిన దాఖలాలున్నందున మానవ ప్రమేయంతో తీసిన గుంతల్లోనే మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.