అమరావతి: పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేపడుతామని, త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రిగా నారాయణ తెలిపారు. పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయం, అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లు పూర్తి చేస్తామని, ప్రపంచ టాప్-5 రాజధానుల్లో అమరావతి ఉండాలని చంద్రబాబు లక్ష్యమన్నారు.
రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్షలు జరిపారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని, అన్న క్యాంటీన్లలో ఇప్పుడు కూడా రూ.5కే భోజనం, అల్పాహారం ఉంటుందని చెప్పారు. కండీషన్‌లో లేని అన్న క్యాంటీన్ల భవనాల మరమ్మతులు చేపట్టడంతో పాటు అన్న క్యాంటీన్ల టెండర్ ఎవరికి ఇవ్వాలనేదానిపై చర్చిస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.