వ్యాపార లావాదేవీల్లో తేడాలు రావడంతో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలిలో సాయిగుప్తా డిఎల్‌ఎఫ్ వద్ద కిక్ స్టార్ట్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సతీష్‌తో కలిసి కారులో ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో ఫార్చూనర్, ఐ 20 కార్లలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు సాయిగుప్తాకారు ఢీకొట్టారు. వెంటనే సాయిగుప్తా కారు వద్దకు వెళ్లి ఎస్‌ఓటి పోలీసులమని చెప్పి ఇద్దరిని తమ కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. మొదట జగద్గిరిగుట్టలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరిపై దాడి చేశారు.
వెంటనే రూ.4కోట్లు కుటుంబసభ్యులతో తెప్పించాలని లేకుంటే చంపివేస్తామని బెదిరించారు. తర్వాత అక్కడి నుంచి వికారాబాద్‌కు తీసుకెళ్లి మరోసారి దాడికి పాల్పడ్డారు. ఇంతలోనే సాయిగుప్తాను కిడ్నాప్ చేసిన విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమకోసం గాలిస్తున్నారని తెలుసుకున్న దుండగులు ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకొని వారిద్దరిని వికారాబాద్‌లో వదిలి వెళ్లిపోయారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మొత్తం 13 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో గౌతమ్ భవిరిషెట్టితో కలిసి సాయిగుప్తా వ్యాపారం చేశాడు.
గత కొంతకాలంగా సాయి గుప్తా, గౌతమ్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో సాయి గుప్తా కారులో వెళ్తుండగా కార్లలో వచ్చి కిడ్నాప్ చేయించినట్లు తెలిసింది. కిడ్నాప్‌కు ప్రధాన సూత్రధారి గౌతమ్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో గౌతమ్ భవిరి శెట్టి ,రౌడీ షీటర్ ప్రశాంత్ తో పాటు 13 మంది ఉన్నట్లు తెలిసింది. మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిసింది.