Sunday, November 24, 2024

ఎన్‌డిఎ ప్రభుత్వానికి కెటిఆర్ బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్‌లో రూ.30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. ఆది నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్‌పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోడీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్‌లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని కెటిఆర్ ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్‌లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా చిత్రమైన సమాధానాలు చెప్పిందని కెటిఆర్ తెలిపారు.

ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని, అసలు నీట్ లాంటి ఎగ్జామ్‌లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదని, అయినప్పటికీ ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్‌టిఎ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News