మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కొత్త వైద్య కళాశాలల అనుమతిపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసి) ఏమీ తేల్చకపోవడంతో ఈసారికి కొత్త కాలేజీలు అందుబాటులోకి వస్తాయా..? లేదా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు(కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో) ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి గత ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఈ విద్యాసంవత్సరం ఎనిమిది మెడికల్ కాలేజీలు (గద్వాల, వరంగల్(నర్సంపేట్), యాదాద్రి, మేడ్చల్ (కుత్బుల్లాపూర్), నారాయణపేట్, ములుగు, మెదక్, రంగారెడ్డి(మహేశ్వరం) జిల్లాల్లో) వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు- సెప్టెంబరులో ఎన్‌ఎంకికి దరఖాస్తు చేసింది.
ఆయా కళాశాలలను వర్చువల్‌గా, స్వయంగా తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ బృందాలు పలు లోపాలను ఎత్తి చూపి వాటిని సరిచేసుకోవాలని సూచించాయి. ఆ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లోపాలను సవరించింది. అయితే ఎన్‌ఎంసి మరోసారి తనిఖీ చేసి వైద్య కళాశాలలకు అనుమతి ఇస్తుంది. మరికొద్ది రోజుల్లో మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఇప్పటివరకు ఎనిమిది కొత్త కాలేజీలకు సంబంధించి ఎన్‌ఎంసి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి వస్తుందా..? లేదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఎన్‌ఎంసి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఆ విషయం అయినా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎనిమిది మెడికల్ కాలేజీలకు సంబంధించి అనుమతి ఇవ్వడం లేదని ఎన్‌ఎంసి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఈసారే అనుమతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
400 ఎంబిబిఎస్ సీట్ల పెంపు
రాష్ట్రంలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి లభిస్తే ఒక్కో కాలేజీకి 50 ఎంబిబిఎస్ సీట్ల చొప్పున ఈ విద్యాసంవత్సరం 400 ఎంబిబిఎస్ సీట్లు పెరుగనున్నాయి. 2014 వరకు తెలంగాణలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించడంలో భాగంగా ఈ విద్యాసంవత్సరం చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కావాల్సి ఉన్నది. గత ఏడాది తొమ్మిది మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరగా, ఈ ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయితే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3690 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి లభిస్తే అదనంగా మరో 400 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
మెడికల్ కౌన్సెలింగ్ ఆలస్యం..?
నీట్- యుజి (2024) ఫలితాలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం మెడికల్ కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ కాలం మినహా సాధారణంగా ఏటా జులైలో మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమై ఆగస్టు 30 నాటికి ముగుస్తుంది. అయితే ఈసారి నీట్ యుజి ఫలితాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండటంతో పాటు రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండటంతో ఈసారి మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.