Saturday, November 23, 2024

అవకతవకలు జరగలేదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ వేసిందని, గత ప్రభుత్వ చేసుకున్న ఒప్పందాలపై విచారణ చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చామని, ప్రభుత్వం శ్వేత పత్రాలు కూడా విడుదల చేశామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిందని, కమిషన్ సందేహాలకు తమ పార్టీ అధినేత కెసిఆర్ సమాధానం ఇచ్చారని చెప్పారు. జస్టిస్ నరసింహారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 15 వరకు నోటీసులో గడువు ఇచ్చి 11న జరిగిన మీడియా సమావేశంలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారని అలా చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

ఆయన ప్రవర్తనతో ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లేందుకు ఆస్కారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంలోని ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో న్యాయ విచారణ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో మెుదటిసారిగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో అన్ని రకాల చట్టాలను, నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర అనుమతులను సాధిస్తూ ముందుకు వెళ్లామని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నాయని, తాము మాత్రం 3.90 పైసలకు విద్యుత్ తీసుకున్నామని వివరించారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై తాము అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్, బిజెపి నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని తెలిపారు. కమిషన్ ఏర్పాటు కుట్రపూరితంగా జరిగిందని, ఏమైనా అవినీతి జరిగితే నిజానిజాలు బయటపెట్టాలని అన్నారు. కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, కమిషన్ చైర్మన్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు.

విచారణకు కెసిఆర్‌కు మాత్రమే కాదు, అందరినీ పిలవాలని అన్నారు. కమిషన్ చైర్మన్ ఉద్దేశం ముందే తేలిపోయిందని పేర్కొన్నారు. బండి సంజయ్ అజ్ఞాపను మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి కలిసి కెసిఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి మారిపోయారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న ఆయన ఇప్పుడు మారారని చెప్పారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కెసిఆర్‌పై ఆయన సానుభూతి ఉంటుందనుకున్నామని, కానీ ఆయన తీరు అలా లేదని వాపోయారు. ఆయన నిజాయితీగా ఉంటే కమిషన్ బాధ్యత నుంచి వైదొలగాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News