ఎన్నికల సంఘం ఫలితాల విడుదల చేయడంలో జరిగిన జాప్యానికి విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ విషయం అలా ఉండగా! వెల్లడైన ఓట్ల ఫలితాలలో అనుసరించిన పద్ధతులు ముఖ్యంగా మొత్తం లెక్కించిన ఓట్లు, పోలైన ఓట్ల మధ్య తేడాలు ఉండటంతో ఫలితాలు అధికార, ప్రతి పక్ష సభ్యుల గెలుపు, ఓటములను ప్రభావితం చేశాయి. ఈ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణల చాలా బలంగా సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. కౌంటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్‌సైట్‌లో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ ‘ది వైర్’ లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ ఇప్పుడు సంచలనంగా మారింది. చాలా నియోజక వర్గాలలో ఇవిఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఆ ఆర్టికల్ ఆధార సహితంగా పేర్కొంది.
భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలలో ఒకటి. ఇక్కడ జరిగే ఎన్నికలను యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. అధికారంలో ఏ పార్టీ ఉండాలి? ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉండాలో ఎన్నికల ద్వారానే ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అయితే ఈ ఎన్నికలను వంద శాతం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించే గురుతర బాధ్యత భారత ఎన్నికల సంఘం (సిఇసి) పై ఉంది. ఇంత పెద్ద దేశానికి ప్రశాంతంగా, విమర్శలకు అతీతంగా ఎన్నికల నిర్వాహించడం మామూలు విషయం కాదు. 1950 నుండి మొన్న జరిగిన (2024) ఎన్నికల వరకు అక్కడక్కడ చిన్నపాటి చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తానికి మన ఎన్నికల సంఘం అతి సమర్ధవంతంగా ఎ్నకలు నిర్వహించింది.
అయితే ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ పరస్పరం నిందలు, ఆరోపణలు చేసుకోవటం మామూలే. ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకోవడం కూడా సహజమే. ఈ సారి మొత్తం 7 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పక్ష నాయకుడు మోడీజీ కొంత శ్రుతిమించి ఒక మతాన్ని టార్గెట్ చేసి, పలు ఎన్నికల సభలలో హేట్ స్పీచ్‌లు ఇచ్చారు అన్నవిపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు జాతీయ, అంతర్జాతీయ మీడియా విశ్వవ్యాప్తం చేశాయి. అయితే మన ఎన్నికల సంఘం ఈ తీవ్రమైన ఆరోపణలను పెద్దగా పట్టించుకోలేదు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో ఇవిఎంల వాడకంపై పలు అనుమానాలను వ్యక్తం చేశాయి. అందుకు అనుగుణంగా విపక్షాలు నిరసన దీక్షలు చేశారు. సుప్రీం కోర్టులో కేసులు వేశారు. సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. మొదట వెల్లడించిన పోలైన ఎన్నికల శాతానికి, ఆ తరువాత కొన్ని రోజులు అసాధారణంగా సమయం తీసుకొని ప్రకటించిన పోలింగ్ శాతాలలో భారీగా వ్యత్యా సం ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఎన్నికల సంఘం ఫలితాల విడుదల చేయడంలో జరిగిన జాప్యానికి విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ విషయం అలా ఉండగా! వెల్లడైన ఓట్ల ఫలితాలలో అనుసరించిన పద్ధతులు ముఖ్యంగా మొత్తం లెక్కించిన ఓట్లు, పోలైన ఓట్ల మధ్య తేడాలు ఉండటంతో ఫలితాలు అధికార, ప్రతి పక్ష సభ్యుల గెలుపు, ఓటములను ప్రభావితం చేశాయి. ఈ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణల చాలా బలంగా సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. కౌంటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్‌సైట్‌లో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ ‘ది వైర్’ లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ ఇప్పుడు సంచలనగా మారింది. చాలా నియోజకవర్గాలలో ఇవిఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఆ ఆర్టికల్ ఆధార సహితంగా పేర్కొంది.
543 నియోజక వర్గాలకుగాను డామన్ డయ్యూ, లక్షదీప్, కేరళలో అట్టింగల్ మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆ ఆర్టికల్‌లో పూనమ్ అగర్వాల్ ఆరోపించారు. పోలైన ఓట్లకు, లెక్కించని ఓట్లకు లెక్క సరిపోవడం లేదని పరిశీలనలో తెలింది. ఏకంగా 140కి పైగా లోక్‌సభ నియోజకవర్గాలలో ఇవిఎంలలో పోలైన ఓట్ల కంటే, లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయని ఈ వ్యత్యాసం 2 ఓట్ల నుంచి 3,811 ఓట్ల వరకు ఉంటుందని పూనం అగర్వాల్ తన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అదే విధంగా ఇవిఎంలలో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించిన నియోజకవర్గాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయని ఆమె చెప్పారు. కొన్ని నియోజక వర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కింపు మధ్య 2 ఓట్ల తేడా ఉన్నదని అగర్వాల్ పేర్కొన్నారు. ఆయా స్థానాల్లో చాలా తక్కువ మార్జిన్‌తో గెలుపు, ఓటమి నిర్ణయం జరిగిందని వెల్లడించారు. ఉదా॥ వాయువ్య ముంబై (మహారాష్ట్ర)లో 9,51,580 ఇవిఎంలలో ఓట్లు పోలవగా, 9,51,582 ఓట్లు లెక్కించారు. అంటే 2 ఓట్లు అధికంగా లెక్కించారు. ఈ స్థానంలో శివసేన (షిండే) వర్గం అభ్యర్థి కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే జైపూర్ రూరల్ (రాజస్థాన్) 12,38,818 ఓట్లు పోలవగా, 12,37,966 ఓట్ల ను లెక్కించారు. ఇక్కడ 852 ఓట్ల తేడా కనిపిస్తుంది. ఇక్కడ బిజెపి అభ్యర్థి 1,615 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కంకేర్ (చత్తీస్‌గఢ్) లో ఇక్కడ 12,61,103 ఇవిఎం ఓట్లు పోలవగా, 12,60,153 మాత్రమే లెక్కించారు. అంటే 950 ఓట్లు కౌంటింగ్‌లోకి రాలేదు. ఇక్కడ బిజెపి అభ్యర్థి 1,884 ఓట్ల తేడాతో గెలిచారు. ఫారూకాబాద్ (యుపి)లో 10,32,244 ఇవిఎం ఓట్ల పోలవగా, 10,31,784 మాత్రమే లెక్కించారు. 460 ఓట్లను లెక్కించలేదు. ఇక్కడ బిజెపి అభ్యర్ధి 2,678 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1. కరీంఘంజ్ (అసోం) పార్లమెంటరీ నియోజక వర్గంలో లెక్కించిన ఓట్లు 11,40,349, పోలైన ఓట్లు 11,36,538. ఈ రెండింటికి తేడా 3,811. 2. ఒంగోలు (ఆంధ్రప్రదేశ్)లో ఈ నియోజక వర్గంలో లెక్కించిన ఓట్లు 14,01,174, పోలైన ఓట్లు 13,99,707 తేడా 1,467. 3. మండ్ల (మధ్యప్రదేశ్) లోఈ పార్లమెంటరీ నియోజక వర్గంలో మొత్తం లెక్కించిన ఓట్లు 15,31,950, కాగా పోలైన ఓట్లు 15,30,861 తేడా 1,089. తక్కువగా ఓట్లులెక్కించిన మొదటి 3 స్థానాలు:1. తిరువళ్ళూరు పార్లమెంటరీ నియోజక వర్గంలో (తమిళనాడు) లెక్కించిన ఓట్లు 14,13,947, పోలైన ఓట్లు 14,30,738, తేడా -16,791. 2.కొక్రాఝార్ (అసోం) ఈ నియోజక వర్గంలో లెక్కించిన ఓట్లు 12,29,546. పోలైన ఓట్లు 12,40, 306, తేడా -10,760. 3. ధెన్కనాల్ (ఒడిశా) ఈ పార్లమెంటరీ నియోజక వర్గంలో లెక్కించిన ఓట్లు 11,84,033, పోలైన ఓట్లు 11,93,460 తేడా -9,427.
ఈ విధంగా లోక్‌సభ ఎన్నికలు 7 దశల వారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం ఖచ్చితమైన పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను వెంటనే వెల్లడించ లేదు. దానితో రాజకీయ పార్టీలు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వెల్లువలా డిమాండ్ చేసిన తర్వాతనే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు వివరాలను విడుదల చేయటాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల లెక్కింపులో వెల్లడైన ఫలితాలు అధికార బిజెపికి అనుచిత లాభం జరిగిందని విపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ అవకతవకలపై నిష్పాక్షికంగా జుడీషియల్ పర్యవేక్షణలో విచారణ జరగాలని విపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496