న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు సరిహద్దు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో వడగాల్పులు బలంగా వీస్తున్నాయి. వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జారీ చేసిన రెడ్ అలర్ట్‌ను బుధవారం వరకు పొడిగిస్తున్నట్టు భారత వాతావరణం విభాగం మంగళవారం వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గౌహతిలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని, సిక్కింలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడడమే కాకుండా భారీ వరదలు సైతం పోటెత్తాయని వివరించింది.
ఈ నేపథ్యంలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని భారత వాతావరణ విభాగం తెలిపింది. దేశం లోని వాయువ్య ప్రాంతం లదాఖ్ నుంచి ఝార్ఖండ్ వరకు వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. వచ్చే 24 గంటలు, ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చే అవకాశమే లేదని తెలిపింది. మహా అయితే 2 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని చెప్పింది. ఇక మధ్య, పశ్చిమ భారతావనిలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, అవి మూడు రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం వివరించింది.