భారత్‌తో కలసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామంటూ ఇటలీలో జరిగిన జి7 దేశాల సదస్సు ముగింపు రోజున కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఒకింత ఆశ్చర్యం కలిగించిన మాట నిజం. భారత ప్రధానితో కాసేపు సంభాషించిన ట్రూడో, ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఇరు దేశాలూ భవిష్యత్తులో ఎన్నో ముఖ్యమైన పనులను చక్కబెడతాయంటూ చెప్పుకొచ్చారు. సున్నితమైన అంశాల జోలికి పోకపోయినా, ఇరు దేశాధినేతలూ ద్వైపాక్షిక అంశాలపై క్లుప్తంగా చర్చించారంటూ కెనడా ప్రధాని కార్యాలయం పేర్కొంది. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ గత సెప్టెంబర్‌లో ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ఆ తర్వాత ట్రూడో సానుకూల వైఖరితో మాట్లాడటం ఇదే మొదటిసారి.
నిజ్జర్ హత్య జరిగి (జూన్18) ఏడాది పూర్తి కావడానికి రెండు రోజుల ముందు జరిగిన ఈ భేటీ దౌత్యపరంగా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నదంటూ ట్రూడే చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్‌ఐఎ నిందితులుగా పేర్కొన్న అనేకమంది కెనడాలో స్థిరపడి, ఆ దేశ పౌరసత్వం సంపాదించి, అక్కడినుంచి భారత్ లో నేర కలాపాలు సాగిస్తున్నారు. ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు చేపట్టేందుకు వారికి ఐఎస్‌ఐ నుంచి నిధులు అందుతున్నట్లు భారత్ అనుమానిస్తోంది. నిజ్జర్ కేసులో భారత ఏజెంట్ల ప్రమేయాన్ని ధ్రువీకరించే ఆధారాలు ఇప్పటి వరకూ లభించకపోయినా ట్రూడో పదేపదే భారత్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమంటూ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీనిపై ఆధారాలు అందిస్తే చర్యలు తీసుకుంటామంటూ భారత్ ముందుకొచ్చినా పట్టించుకోకుండా భారత్‌ను నిందించడమే పనిగా పెట్టుకోవడం గమనార్హం. నిజ్జర్ కేసులో ప్రత్యక్షంగా భారత్ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాలేవీ ఇంతవరకూ బయటపడలేదు.
ఒక్క నిజ్జర్ కేసులోనే కాదు, కెనడా ఎన్నికల్లోనూ భారత్ జోక్యం చేసుకుంటోందంటూ ఒక సందర్భంలో ట్రూడో తన అక్కసు వెళ్లగక్కారు. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని భారత్ తేల్చిచెప్పినా పట్టించుకోకుండా, ఈ వ్యవహారంపై ట్రూడో స్వతంత్ర దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదంటూ సదరు కమిషన్ క్లీన్ చిట్ ఇవ్వడం ట్రూడోకు చెంపపెట్టులా పరిణమించింది. ఉభయ దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లడంతో తమ తమ దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని సైతం తగ్గించుకున్నాయి. కెనడియన్లకు భారత్ వీసాల మంజూరును తాత్కాలికంగా నిలిపివేసింది కూడా. కెనడాలో ట్రూడో నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఖలిస్థాన్ కు మద్దతు పలుకుతున్న జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు కీలకం. ఈ నేపథ్యంలో ట్రూడో భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
భారత్- కెనడాల మధ్య క్షీణించిన దౌత్య సంబంధాలు కెనడాలో స్థిరపడిన, అక్కడ చదువుకుంటున్న భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.కెనడాకు వెళ్లే విదేశీ విద్యార్థులలో భారతీయులదే అగ్రభాగం. ఏటా లక్షలాది భారత విద్యార్థులు చదువుల నిమిత్తం కెనడాకు వెళ్తుంటారు. ట్రూడో ప్రభుత్వం భారత్‌పై అక్కసును కెనడాకు వెళ్లి చదువుకునే విద్యార్థులపై చూపిస్తోంది. గత సంవత్సరాంతంలో స్టడీ పర్మిట్లలో కోత విధించడంతో కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులు మరో దారి చూసుకోవలసి వస్తోంది. ఇరుదేశాల మధ్య బెడిసిన సంబంధ బాంధవ్యాలు తిరిగి బలపడాలంటే భారత్ -కెనడా దేశాధినేతలు పట్టువీడి, చొరవ చూపి ప్రస్తుత సమస్యలకు పరిష్కారం సాధించే దిశగా ద్వైపాక్షిక చర్చలకు ఉపక్రమించాలి.
తమ దేశంలో తిష్ఠవేసి, భారత్‌లో ఖలిస్థాన్ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న సిక్కు అతివాద నేతలను అదుపులో పెట్టడం ట్రూడో చేయవలసిన పని. అలాగే దేశంలోనూ, బయటా సిక్కుల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు భారత్ చొరవ చూపాలి. అదే సమయంలో నిజ్జర్ సహా ఇతర దేశాల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సిక్కు నాయకుల కేసులపై జరుగుతున్న దర్యాప్తుకు భారత్ సహకరించాలి. దశాబ్దకాలంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతూ వస్తున్న సుహృద్భావ వాతావరణం ఇటీవలి కాలంలో దెబ్బతిన్నదన్న విషయాన్ని ఇరు దేశాధినేతలూ అంగీకరించి, తిరిగి పునరుద్ధరించేందుకు తమ వంతు కృషి చేయడం శ్రేయోదాయకం.