Friday, December 20, 2024

రూ. 100 కోట్ల ముడుపులు డిమాండ్ చేసిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి
రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపిన ఇడి

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ. 100 కోట్ల ముడుపులను డిమాండ్ చేసినట్లుగా తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) బుధవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియచేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇడి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇడి దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ఇదే కేసులో సహ నిందితుడైన ఢిలీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం మనీ లాండరింగ్ ఆరోపణలను ఆమోదించినట్లేనని ఆయన తెలిపారు.

ఈ కేసులో మనీ లాంరింగ్ జరిగినట్లు ఇడి దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని సంతృప్తి చెందినట్లేనని ఆయన చెప్పారు. రూ. 100 కోట్ల ముడుపులను కేజ్రీవాల్ డిమాండ్ చేసినట్లు సిబిఐ దర్యాప్తులో వెల్లడైందని ఇడి తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుకు ముందే సాక్ష్యాలను తాము సేకరించామని ఎఎస్‌జి రాజు కోర్టుకు తెలిపారు. కాగా..కేజ్రీవాల్ తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపిస్తూ ఏ చార్జిషీట్‌లోను కేజ్రీవాల్ పేరును ప్రస్తావించలేదని తెలిపారు. సిబిఐ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదని ఆయన తెలిపారు. ఇడి చేస్తున్న ఆరోపణలన్నీ పిఎంఎల్‌ఎ కింద కాకుండా సిబిఐ కేసులో వాదనలు వినిపిస్తున్నట్లు ఉందని ఆయన తెలిపారు.

మే 10న సుప్రీంకోర్టు తన ఉత్తర్వులలో దిగువ కోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పేర్కొందని న్యాయవాది తెలిపారు. బెయిల్ ఇప్పిస్తామన్న హామీతో ఇదివరకు అరెస్టు చేసిన సాక్షుల వాంగ్మూలాల ఆధారంగానే మొత్తం కేసు నడుస్తోందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. క్షమాభిక్ష పెడతామని ప్రలోభ పెట్టి సాక్షం చెప్పించారని, సాక్షం ఇచ్చిన వారి విశ్వసనీయతను సవాలు చేస్తున్నామని న్యాయవాది చెప్పారు. 2022 ఆగస్టులో ఈ కేసు పురుడుపోసుకోగా 2024 మార్చిలో కేజ్రీవాల్ అరెస్టు జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌న అరెస్టు చేయడం దీని వెనుక గల దురుద్దేశాన్ని తెలియచేస్తోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని కోర్టు జులై 3వ తేదీ వరకు పొగించింది.

Aravind Kejriwal demanded 100 crore donations

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News