వైద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నీట్–యుజిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పారీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యాలయాలలో శుక్రవారం(జూన్ 21) నిరసనలు నిర్వహించనున్నది. నీట్ నిర్వహణ, ఫలితాల చుట్టూ అలుముకున్న ఫిర్యాదులు, అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నాయకులు, రాష్ట్ర ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అగ్ర నేతలకు బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.
జూన్ 4న నీట్ యుజి ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించగా నీట్ పేపర్ లీకేజీలు, మార్కులు హెచ్చిందపు తదితర అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తాయని ఆయన ఆ లేఖలో తెలిపారు. ఎటువంటి శాస్త్రీయత లేకుండా కొందరు అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిచ్చిందని ఆయన తెలిపారు.బిజెపి పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్, హర్యానాలో నీట్ నిర్వహణలో అవినీతి జరిగినట్లు అరెస్టుల ద్వారా తేలిందని వేణుగోపాల్ తెలిపారు. నీట్‌లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ఎటువంటి చర్యను చేపట్టకుండా మౌనవం వహించిన ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 21న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యాలయాలలో భారీ స్థాయిలో నిరసనలు నిర్వహించాలని పిసిసి కమిటీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.