Saturday, November 23, 2024

నా పిఎ తప్పు చేస్తే అరెస్టు చేయండి:తేజస్వీ

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తన వ్యక్తిగత సహాయకుడికి సంబంధం ఉన్నట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా చేసిన ఆరోపణలను ఆర్‌జెడి నాయకుడు తేజస్వీ యాదవ్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి నుంచి దృష్టి మళ్లించేందుకే సిన్హా ఈ ఆరోపణలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత సహాయకుడు(పిఎ) ప్రీతమ్ కుమార్ గురించి ఆర్థిక నేరాల విభాగం(ఇఓయు) ఎటువంటి ఆరోపణలు చేయలేదని, కేవలం విజయ్ సిన్హా ఒక్కరే ఈ ఆరోపణలు చేస్తున్నారని విలేకరులతో మాట్లాడుతూ తేజస్వీ యాదవ్ అన్నారు. అవసరమైతే తన పిఎను పిలిపించి ప్రశ్నించవచ్చని ఆయన విజయ్ సిన్హాను సవాలు చేశారు. అసలు సూత్రధారిని కాపాడేందుకే ఈ పక్కదారి పట్టించే ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అరెస్టయిన నిందితులలో ఒకడైన అమిత్ ఆనంద్ బిజెపి నాయకుడు సామ్రాట్ చౌదరితో కలసి దిగిన ఫోటో బయట పడిందని, ఒకవేళ తన పిఎ దోషి అయితే ఆయనను అరెస్టు చేయవచ్చని తేజస్వీ చెప్పారు.

ఈ వివాదం తన పేరును లాగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకు వెనుక ప్రధాన సూత్రధారి అమిత్ ఆనంద్ అని, అతనిపైన చర్యలు తీసుకోవాలని తేజస్వీ డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సికందర్ ప్రసాద్ యాదవేందు కోసం ఒక గదిని బుక్ చేయాలని తేజస్వీ యాదవ్ పిఎ ప్రీతమ్ కుమార్ బీహార్ రోడ్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక ఉద్యోగికి ఫోన్ చేసినట్లు విజయ్ సిన్హా గురువారం ఆరోపించారు. పాట్నాలోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో నీట్ పరీక్ష రాస్తున్న తన మేనల్లుడు అనురాగ్ యాదవ్, అతని తల్లి, ఇతర బంధువులకు వసతిని సమకూర్చినట్లు సికందర్ ప్రసాద్ యాదవేందు పోలీసులకు వెల్లడించాడు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు సంబంధించి అనురాగ్ యాదవ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై తాను శాఖాపరమైన విచారణ నిర్వహించానని, నీట్ పరీక్ష మే 5వ తేదీన జరగగా అంతకు నాలుగు రోజుల ముందు మే 1న ఆర్‌సిడి సిబ్బంది ప్రదీప్‌కు ప్రీతమ్ కుమార్ ఫోన్ చేసి ఒక గదిని బుక్ చేయాలని చెప్పాడని తెలిసిందని విజయ్ కుమార్ సిన్హా వెల్లడించారు.

ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని, అధఙకారంలో లేకున్నా లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్నారని ఆయన తేజస్వీ యాదవ్‌పై మండిపడ్డారు. కాగా అనుమానితుడికి తేజస్వీ యాదవ్‌తో ముడిపెట్టడానికి విజయ్ కుమార్ చేసిన ప్రయత్నాన్ని ఆర్‌జెడి తిప్పికొట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన అమిత్ ఆనంద్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో తీసుకున్న ఫోటోను ఆర్‌జెడి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News