Thursday, December 19, 2024

సిఐ లంచావతారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి సిఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ గాజులరామారంకు చెందిన రత్నాకరం సాయి రాజు అనే వ్యక్తి దగ్గర తను ఒక భూమిని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ భూమి విషయమై యజమానులతో గొడవ జరగగా సాయి రాజు సూరారం పోలీస్‌స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో సాయి రాజ్ పై ల్యాండ్ గ్రాబర్ షీట్ తెరుస్తానని సీఐ వెంకటేశం సాయి రాజును బెదిరించాడు. షీట్ తెరవకుండా ఉండాలంటే తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో సిఐని బ్రతిమిలాడిన సాయిరాజ్ అంత ఇచ్చుకోలేనని మూడు లక్షలు ఇస్తానని తెలిపాడు.

మొదటి విడతగా లక్ష రూపాయలు ఇచ్చిన సాయి ఎలాగైనా సీఐ ఆట కట్టించాలని నిర్ణయించుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ బృందం శుక్రవారం సాయంత్రం సూరారం స్టేషన్ లో సిఐ వెంకటేశం తన రూంలో మరో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు సీఐ వెంకటేశం వద్ద నుండి అవినీతి సొమ్మును రికవరీ చేసిన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి ఎసిబి అడిషనల్ స్పెషల్ జడ్జి ముందు హాజరు పరుస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలన్నారు తెలిపారు. సీఐ నివాసంతోపాటు బంధువులు ఇళ్లలో సోదాలు చేపడుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News