Saturday, October 5, 2024

రాహుల్ ముందుచూపు

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానాన్ని తనకే అట్టిపెట్టుకుని కేరళలోని వయనాడ్ నియోజక వర్గాన్ని తన సోదరి ప్రియాంక గాంధీకి అప్పగించడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుచూపు స్పష్టమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెస్ వైభవాన్ని పెంపొందించుకోడానికి, 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ సీట్లు సాధించుకోడానికి రాయ్‌బరేలీ స్థానమే పోరాట కేంద్రంగా కాంగ్రెస్ మలచుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు సురక్షితమైన స్థానంగా పరిగణిస్తున్న వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ విజయం సాధిస్తే నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి మొదటిసారి పార్లమెంట్‌కు ముగ్గురు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం కలుగుతుంది.

దీంతోపాటు ఒకే కుటుంబం నుంచి వారసత్వ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్‌లో ఆరు స్థానాల్లో విజయం సాధించి మళ్లీ కోలుకోగలిగింది. గత ఐదేళ్లుగా దాదాపు ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌కు ఈసారి ఎన్నికల ఫలితాలు ఊపిరి పోశాయి. ఉత్తరప్రదేశ్ కాషాయనాథుల కంచుకోట అన్న ప్రతిష్టకు బీటలు పడ్డాయి. కాషాయనాథుల్లో అత్యంత ప్రముఖునిగా, ప్రధాని మోడీ అమిత్ షా ద్వయానికి అత్యంత సన్నిహితునిగా పేరు పొందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామర్థానికి సవాలుగా ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ఫలితాలు ఊహించని అనుభవాన్ని మిగిల్చాయి. ఇక కాంగ్రెస్ కూడా ఫలితాలు తమకు ఇంత అనుకూలంగా వస్తాయని ఊహించలేదు. 2014లో కాంగ్రెస్ రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలను సాధించి, ఓట్ల వాటా 7.53% వరకు దక్కించుకోగలిగినప్పటికీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాయ్‌బరేలీ మినహా అమేథీతో సహా అన్ని స్థానాలను కాంగ్రెస్ కోల్పోయింది.

ఆనాడు బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారంటే కాంగ్రెస్ ఉనికి అప్పుడు ఏ విధంగా కోల్పోయిందో చెప్పవచ్చు. ఏదేమైనా ఈసారి కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి, మిగతా స్థానాలను ‘ఇండియా’ కూటమి భాగస్వాములకు విడిచిపెట్టింది. పరిమిత స్థానాల్లోనే పోటీ చేసినప్పటికీ ఆరు స్థానాల్లో గెలవగలిగింది. ఓట్ల వాటా 9.46 శాతానికి పెంచుకోగలిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి సానుకూల ఫలితాలు రావడంతో పార్లమెంట్ దిగువ సభలో అత్యంత గరిష్ఠ స్థాయిలో ప్రాతినిధ్యం పొందగలిగింది.దీంతో రాయ్‌బరేలీ స్థానాన్ని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ విడిచిపెట్టడం లేదన్న సంకేతాలు కాంగ్రెస్ పంపడానికి వీలవుతోంది. మరో ముఖ్యమైన అంశం ఏమంటే కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో సానుకూల ఫలితాలు వెలువడడంతో ఆ రాష్ట్ర ఓటర్ల మనోభావం బిజెపికి వ్యతిరేకంగా ఉన్నట్టు బయటపడింది.

2019లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి 62 సీట్లలో విజయపతాకం ఎగురవేయగా, ఇప్పుడు కేవలం 33 సీట్లనే దక్కించుకోగలిగింది. దీన్ని బట్టి ఉత్తరప్రదేశ్‌లో కమలనాథులకు ప్రజాదరణ సగానికి సగం తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలించి రాహుల్ దూరదృష్టితో కాంగ్రెస్ ఉనికిని మరింత పటిష్టపర్చుకోడానికి గట్టిగా పని చేయాలన్న లక్షంతో రాయ్‌బరేలీ స్థానాన్ని విడిచిపెట్టలేదు. దీని ద్వారా ఉత్తరప్రదేశ్‌లోను, హిందీ రాష్ట్రాల్లోనూ తమ పోరాటాన్ని బిజెపిపై కొనసాగిస్తామని, మరిన్ని ఫలితాలను సాధిస్తామని కాంగ్రెస్ స్పష్టమైన సందేశాన్ని అందించగలిగింది. ఈ మేరకు 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను సాధించడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది.2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేసినా కేవలం రెండే రెండు స్థానాలను దక్కించుకోగలిగింది. ఓట్ల వాటా కూడా 2.33 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షం సమాజ్‌వాది పార్టీతో కలిసి రాహుల్ రాయ్‌బరేలీలో తమ పట్టు గట్టిగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

అందుకే రాయ్‌బరేలీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రాహుల్ వ్యూహాత్మక కార్యస్థాన కేంద్రంగా రూపుదిద్దుకోనున్నది. కేరళలోని వయనాడ్ స్థానం గురించి రాహుల్ పదేపదే భావోద్వేగ సంబంధంగా అభివర్ణించడం ఈ సందర్భంగా ప్రస్తావించడం అవసరం. 2019లో కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్‌లో దాదాపు తుడిచిపెట్టుకుపోయినప్పుడు వయనాడ్ స్థానమే రాహుల్‌ను ఆదుకోగలిగింది. తమ కుటుంబానికి కంచుకోటగా ఉంటున్న అమేథీ కూడా రాహుల్‌కు దూరమైనప్పుడు కేరళలోని కాంగ్రెస్ నాయకుల నేతృత్వంలోని యుడిఎఫ్ ఆసరా కల్పించింది. అందుకనే కాంగ్రెస్‌కు సురక్షితమైన స్థానంగా విశ్వసిస్తోన్న వయనాడ్ నుంచి ఉప ఎన్నికకు పోటీ చేయడానికి రాహుల్ ప్రోద్బలంతో ప్రియాంక గాంధీ సిద్ధమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News