కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న ఓ వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన బీహార్‌లో శనివారం చోటు చేసుకుంది. అయితే ఇందులోఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ వారంలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. బీహార్ లోని సివాన్ జిల్లా లోని గండక్ కాలువపై ఉన్న మహారాజ్‌గంజ్ జిల్లా లోని పటేధి బజార్ మార్కెట్‌ను, దర్భంగా లోని రామ్‌గఢ్ పంచాయతీలో కలుపుతోంది. ఈ వంతెనపై నుంచి ప్రతిరోజూ వందల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా శనివారం ఉదయం ఇది భారీ శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ వంతెన దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిందని, దీని నిర్వహణ సరిగ్గా లేక పోవడం వల్లే కూలిపోయిందని అధికారుల నిర్లక్షమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన కుప్పకూలడంతో గండక్ కాలువ మీదుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీహార్ లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై రూ. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కూలిన సంగతి తెలిసిందే. వారం రోజుల వ్యవధి లోనే రాష్ట్రంలో రెండు వంతెనలు కూలిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.