ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎపి, తెలంగాణలను అనుసంధానం చేసే హైదరాబాద్- టు విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగనుంది. తహసీల్దారు ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు 2 కి.మీ. పొడవునా దీనిని నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు మొత్తం రూ.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టుగా సమాచారం.
రెండు వారాల్లో పనులు ప్రారంభించే చాన్స్
ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇరువైపులా జాతీయ రహదారులు సంస్థ అధికారులు సర్వీస్ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టారు. ముందుగా వలిగొండ అడ్డ రోడ్డు నుంచి పద్మావతి ఫంక్షన్‌హాల్ వరకు 500 మీటర్ల మేర ఈ వంతెన పనులు మరో వారం, పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. కాకపోతే, ఒకవైపు ఈ పనులు పూర్తయిన తర్వాతే రెండోవైపు చేపడుతామని అధికారులు చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్న హర్యానాకు చెందిన రాంకుమార్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఈ నిర్మాణ పనులను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.