టి20 ప్రపంచకప్ సూపర్8 పోరులో భాగంగా యుఎస్‌ఎ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యుఎస్‌ఎ 19.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన వెస్టిండీస్ 10.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షాయ్ హోప్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అమెరికా బౌలర్లను హడలెత్తించిన హోప్ వరుస సిక్సర్లతో పెను సృష్టించాడు. అతన్ని కట్టడి చేసేందుకు యుఎస్‌ఎ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఆరంభం నుంచే హోప్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు మరో ఓపెనర్ చార్లెస్‌తో కలిసి 67 పరుగులు జోడించాడు. చార్లెస్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ నికోలస్ పూరన్ అండతో హోప్ మరో వికెట్ కోల్పోకుండానే విండీస్‌కు విజయం సాధించి పెట్టాడు. చెలరేగి ఆడిన హోప్ 39 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పూరన్ 12 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 27 పరుగులు సాధించాడు. దీంతో విండీస్ అలవోక విజయం సాధించింది.
తక్కువ స్కోరుకే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యుఎస్‌ఎను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో విండీస్ బౌలర్లు సఫలమయ్యారు. కరీబియన్ బౌలర్లు సమష్టిగా రాణించి అమెరికా ఇన్నింగ్స్‌ను 128 పరుగులకే కుప్పకూల్చారు. ఓపెనర్ స్టీవెన్ రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ అండ్రీస్ గౌస్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారిలో ఎన్‌ఆర్ కుమార్ (20), మిలింద్ కుమార్ (19) కాస్త రాణించారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు. రసెల్‌కు కూడా మూడు వికెట్లు దక్కాయి. అల్జరీ జోసెఫ్ రెండు వికెట్లు తీసి తనవంతు సహకారం అందించాడు. ఇక వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన అమెరికా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఇక సౌతాఫ్రికా ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది.