న్యూఢిల్లీ: మే 5న నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యూజీ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. పరీక్షలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది.
కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సిబిఐ తాజాగా కేసు నమోదు చేసిందని అధికారులు తెలిపారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఆ మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఆరోపించిన అవకతవకలపై దర్యాప్తు కోసం అనేక నగరాల్లో నిరసనలు చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను మంత్రిత్వ శాఖ మన్నించాల్సి వచ్చిందని వారు చెప్పారు.
“మే 5న నిర్వహించిన నీట్-యూజీలో కొన్ని అక్రమాలు, మోసాలు, వంచన , అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి” అని విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “పరీక్షా ప్రక్రియ నిర్వహణలో పారదర్శకత కోసం, సమగ్ర దర్యాప్తు కోసం… ఈ అంశాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించాలని సమీక్ష తర్వాత నిర్ణయించారు” అని ఆ అధికారి తెలిపారు.