స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ టిప్పుల పేరుతో ఓ యువతిని మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరానికి చెందిన ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ క్లబ్ పేరుతో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ను యువతిని సంప్రదించాడు. తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. ట్రేడింగ్‌లో టిప్పులు ఇస్తామని, స్టాక్ రెకమెండేషన్ చేస్తామని చెప్పారు. నెల రోజులు వారు చెప్పినట్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టడంతో లాభాలు వచ్చాయి. దీంతో యువతిని తాము చెప్పిన బ్లాక్ అప్‌ప్రో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పడంతో అలాగే చేసింది. తర్వాత ఈ యాప్‌లోనే నిందితులు చెప్పిన టిప్పులతో ట్రేడింగ్ చేసింది, మొదట్లో తక్కువ మొత్తంలో వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకునేది.
దీనికి నిందితులు ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేదు. కానీ భారీగా లాభాలు రావడంతో యాప్‌లో ఉన్న బ్యాలెన్స్ రూ.8,47,000 విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించగా వీలుకాలేదు, తమకు 20శాతం కమీషన్ ఇస్తేనే డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. దీంతో బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.