Friday, November 22, 2024

ముడుపు ముడితేనే ఫైల్ కదిలేది

- Advertisement -
- Advertisement -

హెచ్‌ఎండిఏలో ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపంతో కొందరు ప్లానింగ్ అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు భారీగా వెల్లువెత్తుతున్నాయి. గతంలో హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అరెస్టు తరువాత కొన్నిరోజులు హెచ్‌ఎండిఏ అధికారులు, సిబ్బంది స్థబ్తుగా ఉన్నా ప్రస్తుతం మళ్లీ భారీగా తమ చేతులకు పనిచెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ అంతస్థుల నిర్మాణాల నుంచి లే ఔట్ అనుమతుల వరకు అన్నింటిలో పైసలివ్వనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు.

ఒకవేళ ముడుపులు ముట్టచెప్పకపోతే దానికి బదులుగా ఆయా లే ఔట్‌లలో ప్లాట్‌లను తమ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని బాహాటంగా పలువురు లే ఔట్ యజమానులు ఆరోపిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ ఆరునెలల్లో 1,180 లే ఔట్‌లు, భవన నిర్మాణాలకు అధికారులు అనుమలు జారీ చేశారు. అందులో పాతవి, కొత్తవి కలిపి ఉన్నాయి. వీటితో పాటు ఫైనల్ లే ఔట్‌కు అనుమతులు ఇచ్చినవి ఉన్నాయి. ఇలా ప్రతి అనుమతులకు సపరేటుగా ధరను అధికారులు నిర్ణయిస్తుండడం విశేషం.

డబ్బులు ఇవ్వకపోతే ముప్పుతిప్పలు…
హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అరెస్టు తరువాత కొన్ని రోజులు లే ఔట్‌లు, భారీ అంతస్థుల నిర్మాణాల అనుమతులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కొన్ని బడా రియల్ సంస్థలతో పాటు క్రెడాయ్ హైదరాబాద్ సభ్యులు సిఎం రేవంత్‌ను కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. దీంతో అనుమతులు మళ్లీ పంజుకున్నాయి. ఇదే అదునుగా కొందరు ప్లానింగ్ అధికారులు, తహసీల్దార్‌లు కలిసి లే ఔట్‌ల అనుమతుల విషయంలో భారీగా ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం ఈ వ్యవహారం అంతా ప్లానింగ్ అధికారుల డ్రైవర్లు, వారి ప్రైవేటు సిబ్బంది చక్కబెడుతున్నారని తెలిసింది.

లే ఔట్ లేదా నిర్మాణాల అనుమతుల విషయంలో ఆయా అధికారులకు అడిగినది ముట్టచెబితే అది ఎలాంటి భూమి అయినా అనుమతులు ఇవ్వరాకున్నా దానికి ప్లానింగ్ అధికారులే సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు చేసే లే ఔట్‌లలో భూ వివాదాలు ఉన్నా, ప్రభుత్వ భూమితో కలిపి లే ఔట్ చేసినా బఫర్‌జోన్, శిఖం భూమిలో వెంచర్ చేసినా, నిర్మాణాలు చేపట్టినా అనుమతుల విషయంలో ఆ అధికారులు ముఖ్యపాత్ర వహిస్తున్నారని సమాచారం. డబ్బులు ముట్టచెబితే ఒకలా, ఇవ్వకపోతే ఆ లే ఔట్, నిర్మాణాలు చేపట్టే వారిని ముప్పుతిప్పలు పెడుతూ సంవత్సరాల తరబడి హెచ్‌ఎండిఏ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

డిప్యూటేషన్ అధికారులదే హవా…
డిప్యూటేషన్ అధికారులదే ఇక్కడ హవా కొనసాగుతుండడంతో సొంత శాఖ వారు సైలెంట్ అయిపోతున్నారు. రాజకీయ నాయకుల ఫైరవీలతో హెచ్‌ఎండిఏలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వారు చెప్పిందే వేదంగా కొనసాగుతోంది. దీంతో ఉన్నన్నీ రోజులు అందినకాడికి దండుకోవాలన్న ఆలోచనతో రెండు చేతులా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ అవినీతిలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కూడా భాగస్వాములు కావడంతో అవినీతి దందా యథేచ్ఛగా కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు మధ్య వర్తుల ద్వారా ఫైళ్లను ప్లానింగ్ అధికారుల వద్దకు తీసుకెళితే ఎలాంటి కొర్రీలు ఉండవని ఆ శాఖ సిబ్బంది పేర్కొంటుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News