న్యూఢిల్లీ: తీస్తా నదీ జలాల పంపిణీపై ఇటీవల బంగ్లాదేశ్, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని మినహాయించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్చలు ఏకపక్షంగా జరిగాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధాని మోడీకి లేఖ రాశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన చర్చలకు తమను ఆహ్వానించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోకుండా అలాంటి చర్చలు చేపట్టడం సరికాదని, ఈ చర్చలను తాము ఆమోదించలేమని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా పశ్చిమబెంగాల్‌కు సన్నిహిత సంబంధం ఉందని మమత వివరించారు.
గంగానది, తీస్తానది జలాల వాటా అంశంపై ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మోడీ మధ్య చర్చలు జరిగాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఫరక్కా ఒప్పందాన్ని పునరుద్ధరించాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోందని, 1996లో కుదిరిన ఆ ఒప్పందం 2026 లో ముగిసిపోనున్నదని, ఆ ఒప్పందం ప్రకారం భారత్, బంగ్లా మధ్య నీటి పంపిణీ జరుగుతోందని మమత పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌పై ఈ ఒప్పందం ప్రభావం ఉంటుందని ఆమె లేఖలో తెలిపారు. అలాంటి ఒప్పందాల వల్ల బెంగాల్ ప్రజలు తీవ్ర ప్రభావానికి గురవుతారన్నారు. ఈ విషయంలో రాజీ పడేది లేదని ఆమె స్పష్టం చేశారు.
నీట్ పరీక్ష వ్యవస్థను రద్దు చేయాలని ప్రధానికి వినతి
నీట్ పరీక్ష వ్యవస్థను రద్దు చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖలో ప్రధాని నరేంద్రమోడీని అభ్యర్థించారు. నీట్ యుజి పరీక్షలో అవకతవకలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పేపర్ లీకేజిని దృష్టిలో పెట్టుకుని ఆ పరీక్షలను రాష్ట్రాలే నిర్వహించేలా తిరిగి పాత పద్ధతిని అమలు చేయాలని సూచించారు. దీనివల్ల సాధారణ పరిస్థితి నెలకొంటుందని, అభ్యర్థుల్లో నమ్మకం పెరుగుతోందని పేర్కొన్నారు.