Thursday, December 26, 2024

మూడోసారి లోక్ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు 18వ లోక్‌సభ సభ్యులుగా సోమవారం ప్రారంభమైన తొలి సమావేశంలో ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రధానిగా ఈ నెల 9వ తేదీన ప్రమాణం చేశారు. ఆయనతోపాటు ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా అదే రోజు ప్రమాణం చేశారు. వారణాసి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ప్రధాని మోడీ సభా నాయకుడిగా సోమవారం అందరికన్నా ముందుగా ప్రమాణం చేశారు. అధికార పక్ష సభ్యులు జైశ్రీరాం అని నినాదాలు చేస్తుండగా మోడీ హిందీలో లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా..మోడీ ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు రాజ్యాంగం ప్రతులను చేతుల్లో పట్టుకుని నిలబడ్డారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ సీట్లలో మౌనంగా కూర్చుని చేతిలోని రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించారు. మంత్రివర్గ సభ్యులలో విదేశఋ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యులు కాగా సహాయ మంత్రులు జార్జి కురియన్,

రవనీత్ సింగ్‌కు ఏ సభలోను సభ్యత్వం లేదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోర్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 18వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి ఎన్నిక కాగా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి అమిత్ షా, మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి నితిన్ గర్కరీ మరోసారి ఎన్నికయ్యారు. ఈ ముగ్గురూ హిందీలో ప్రమాణం చేశారు. వీరికి ముందు ప్రొటెమ్ స్పీకర్‌కు సహాయపడేందుకు ఎంపికైన సీనియర్ సభ్యులు రాధామోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తే(ఉభయులూ బిజెపి సభ్యులు)నూతన లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. సోమవారం, మంగళవారం రెండు రోజులపాటు జరిగే సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రొటెమ్ స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు వీరు సహాయపడతారు. అయితే ప్రొటెమ్ స్పీకర్‌కు సహాయపడేందుకు ఎంపికైన సీనియర్ సభ్యులు కె సురేష్(కాంగ్రెస్), టిఆర్ బాలు(డిఎంకె), సుదీప్ బందోపాధ్యాయ(టిఎంసి)లను సభ్యులుగా ప్రమాణం చేసేందుకు పిలవగా వారు రాలేదు. దళఙత నాయకుడైన సురేష్ ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచినందున

ప్రొటెమ్ స్పీకర్‌గా ఆయనను ఎంపిక చేయకుండా మెహతాబ్‌ను ఎంపిక చేయడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం తెలియచేస్తోంది. ఇందుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు సురేష్, బాలు, బందోపాధ్యాయ చైర్‌పర్సన్ల ప్యానెల్‌లో చేరబోరని ఇండియా కూటమి ప్రకటించింది. కాగా..వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ, మత్స, పశు సంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్(లలన్) సింగ్, కూడా నూతన లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. మాంఝీ హిందుస్తానీ అవామీ మోర్చ(సెక్యులర్) సభ్యుడు కాగా రాజీవ్ రంజన్ జెడియు సభ్యుడు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి(జెడిఎస్) కన్నడలో ప్రమాణం చేశారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన ఒడియా భాషలో ప్రమాణం చేయగా రేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సామీలో ప్రమాణం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు(తెలుగుదేశం), బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలుగులో ప్రమాణం చేశారు. వినిమయ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కన్నడలో ప్రమాణం చేశారు.

కాగా..కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్థాన ఇంధన శాఖ మంత్రి శ్రీపాద్ వై నాయక్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో లోక్‌సభ సభ్యునిగా ప్రొటెమ్ స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా..నూతన లోక్‌సభ తొలి సమావేశం ప్రారంభానికి గౌరవ సూచనగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించారు. కేంద్ర మంత్రివర్గ సభ్యుల ప్రమాణం అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన నూతన సభ్యులు రాష్ట్రాల పేర్ల అక్షర క్రమంలో ప్రమాణం చేశారు. అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన బిష్ణుపాద రే తొలిగా ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News