న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం కేంద్రం ఓ వెసులుబాటు తీసుకువచ్చింది. అలా సంతానాన్ని పొందిన ఉద్యోగినులకు ఆరు నెలల మాతృత్వ సెలవులు ఇవ్వనుంది. ఈమేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్)రూల్స్ (1972)లో సవరణలు చేసింది. అలాగే ఆ బిడ్డ తండ్రి 15 రోజులు పితృత్వ సెలవులు తీసుకునే వీలు కల్పించింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసీతో సంతానాన్ని పొందితే వారికి 180 రోజుల మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. ఒకవేళ సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకూ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇద్దరు సంతానం వరకే ఈ శెలవులను పొందవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి ఆరు నెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది. ఈ విధానం ద్వారా సంతానం పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు.
ఇప్పటివరకు రూల్స్ ప్రకారం..ఉద్యోగి, ఒంటరి ఉద్యోగి తన పూర్తి సర్వీస్‌లో పిల్లల సంరక్షణ కోసం 730 రోజులు సెలవులుగా పొందుతున్నారు. ఈ క్రమం లోనే జూన్ 18న కేంద్రం కొత్త నిబంధనలను నోటఫై చేసింది. చట్టబద్ధమైన వివాహం ద్వారా అయిదేళ్లు కలిసి ఉన్న దంపతులే సరోగసీకి అర్హులు. భార్యకు 23 నుంచి 50 ఏళ్ల లోపు వయసు, భర్తకు 26 నుంచి 55 ఏళ్ల వయసు ఉండి, సాధారణ పద్దతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఆ దంపతులు సరోగసీ విధానంలో బిడ్డను పొందవచ్చు.