Friday, November 22, 2024

కేంద్రం అసమర్థత.. విద్యార్థుల పాలిట శాపం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీకేజీపై బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ నిర్ణయాలు, ఎలాంటి పొంతన లేకుండా ఉన్నాయని కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నీట్- యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువైనా, మోదీ ప్రభుత్వం జులై 6వ తేదీ నుంచి కౌన్సిలింగ్ కొనసాగిస్తోందని అన్నారు. విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరం చేసేలా వరుస సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన నీట్- యుజి పేపర్ లీక్ అయిందని, జూన్ 19న యుజిసి- నెట్ పరీక్ష రద్దయిందని పేర్కొన్నారు. జూన్ 21న సిఎస్‌ఐఆర్- యుజిసి- నెట్ పరీక్ష వాయిదా పడగా, జూన్ 22న చివరి నిమిషంలో నీట్- పిజి పరీక్ష వాయిదా పడిందని తెలిపారు. ఎలాంటి నిర్ధిష్ట కారణాలు చూపకుండా నీట్- పిజి పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారని, ఈ నిర్ణయాల వెనక ఉన్న లాజిక్ ఏంటని ప్రశ్నించారు. అన్నింటికీ కారణం నేషనల్ డిజాస్ట్రస్ అలయన్స్(ఎన్‌డిఎ) అని కెటిఆర్ పేర్కొన్నారు.

ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా..? -: సిఎం రేవంత్‌కు కెటిఆర్ లేఖ
నేతన్నలవి ఆత్మహత్యలు కాదని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ఖ కెటిఆర్ ఆరోపించారు. నేతన్నల సమస్యలపై కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా..? అని ప్రశ్నించారు. ఇప్పటి దాకా పది మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. గత పదేళ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేతరంగం, ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే అలాంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపివేయాలని ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని తెలిపారు. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతో పాటు కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కేవలం కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈ పరిస్ధితి వచ్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపై అక్కసుతో, వాటిని ఆపివేశారని, దానివల్ల నేతన్నలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనీస కనికరం లేదు అని, ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మగౌరవం చంపుకోలేక నేతన్నలు తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల, కరీంనగర్‌తో పాటు టెక్స్‌టైల్ శాఖ మంత్రి జిల్లా ఖమ్మంలోనూ ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ప్రత్యేకంగా రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News