శాశ్వత భవనాలు లేక అభివృద్ధి కుంటుపడుతోంది
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో సీతక్క భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణా భివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) సమావేశమయ్యారు. గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని ఢిల్లీలోని కృషి భవన్‌లో రాజీవ్ రంజన్ సింగ్‌తో మంగళవారం భేటీ అయిన సీతక్క ఆశోక పిల్లర్ జ్ఞాపికను బహుకరించారు.
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ రంజన్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కి, గ్రామీణ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావటంలో కేంద్ర మంత్రి అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. గ్రామ పంచాయతీల ద్వారా వికేంద్రీకృత పాలనను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందంజలో ఉందని గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో ప్రజా సేవలను మెరుగుపరచడం కోసం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం గ్రామ పంచాయతీల్కు శాశ్వత భవనాల అవసరాన్ని మంత్రి సీతక్క నొక్కి చెప్పారు.
తెలంగాణలోని 32 జిల్లాల్లోని 540 గ్రామీణ మండలాల పరిధిలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 6176 గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు లేవని గుర్తు చేశారు. తాత్కాలిక ఏర్పాట్లతో అద్దె భవనాల్లో గ్రామ పంచాయతీలు పూర్తిస్థాయిలో విధులను నిర్వర్తించలేకపోతున్నాయని మంత్రి నివేదించారు. అందుకే 6176 గ్రామపంచాతీల్లో శాశ్వత భవనాల నిర్మాణం కోసం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద ఒక్కో భవనానికి రూ. 25 లక్షల చొప్పున మొత్తం రూ.1544 కోట్ల నిధులను మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీతక్క విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి తెలంగాణలోని గ్రామ పంచాయతీల శాశ్వత భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.