Sunday, November 24, 2024

కెసిఆర్‌కు మరోసారి విద్యుత్ కమిషన్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేపడుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి నేతృత్వంలోని విద్యుత్ కమిషన్ బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్‌కు వచ్చిన సమాచారంపై కెసిఆర్ అభిప్రాయం ఏంటో చెప్పాలని నోటీసులో పేర్కొంది. ఈ నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని పవర్ కమిషన్ కెసిఆర్‌ను ఆదేశించింది. కెసిఆర్‌తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మరికొంత మందికి సైతం పవర్ కమి షన్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఈ నెల 19వ తేదీనే ఇవ్వగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

కాగా, ఈ అంశంలో కెసిఆర్‌కు పవర్ కమిషన్ ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేసింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన వివరణ కోరింది. కమిషన్ నోటీసులకు కెసిఆర్ సైతం ఘాటు సమాధానం ఇచ్చారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, విచారణ నుండి కమిషన్ చైర్మన్ నర్సింహా రెడ్డి తప్పుకోవాలని కెసిఆర్ సంచలన డిమాండ్ చేశారు. తాజాగా నర్సింహా రెడ్డి కమిషన్ విచారణపై స్టే విధించాలని కెసిఆర్ హైకోర్టును ఆశ్రయించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన నర్సింహా రెడ్డి కమిషన్ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఏర్పాటు చేశారని, కమిషన్ విచారణపై స్టే విధించాలని కెసిఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ విచారణను నిలిపివేయాలని కెసిఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టకముందే విద్యుత్ కమిషన్ మరోసారి గులాబీ బాస్‌కు నోటీసులు జారీ చేయడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కమిషన్ నోటీసులపై ఫస్ట్ టైమ్ ఘాటుగా రియాక్ట్ అయిన గులాబీ బాస్ ఈ సారి ఏ విధంగా స్పందిస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News