Friday, December 20, 2024

పదవికి రాజీనామా.. పార్టీలో కొనసాగుతా: జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జగిత్యాలకు చెందిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సంజయ్ ను కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయమై హైకమాండ్ వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి కార్యకర్తలతో చర్చించిన అనంతరం సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం ఆయన బేగంపేట ప్రకాష్ నగర్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం అసెంబ్లీ చైర్మన్‌కు రాజీనామా ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు జీవన్ రెడ్డి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మీడియా ఎదు ట ప్రకటించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిపోయిందని అందుకే రాజీనామా నిర్ణ యం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని ప్రజా సమస్యలపై నియోజకవర్గంలోని పల్లెల్లో తిరుగుతానని ఆయన అన్నారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు.

అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ఇప్పటివరకు తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని ఆయన చెప్పారు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలోకి తీసుకోవడం మనస్తాపానికి గురి చేసిందని జీవన్ రెడ్డి వాపోయారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్మరించి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వదిలిపెట్టి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం సరికాదన్నారు.

జీవన్‌రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు: భట్టి
జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరిక వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లోనిని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల ఎమ్మెల్యే చేరిక విషయంలో జీవన్ రెడ్డి అసంతృప్తిని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారని, పార్టీలో ఆయన సీనియారిటీకి భంగం కలిగించమన్నారు. పార్టీలో జీవన్ రెడ్డి తగిన గౌరవం కల్పిస్తామని ఆయన చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరికపై అందరం కలిసి చర్చిస్తామన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు ఆయన చాలా కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరంతరం జీవన్‌రెడ్డితో మాట్లాడుతుందని, జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని ఉప ముఖ్యమంత్రి అన్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మనస్తాపం చెందితే తామందరం బాధపడతామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

భట్టి, శ్రీధర్‌బాబులు రంగంలోకి….
కాగా, జగిత్యాల బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో చేరిక గురించి కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకపోవడంపై జీవన్ రెడ్డి అలకబూనారు. ఈ క్రమంలోనే ఆయన్ను బుజ్జిగించేందుకు భట్టి, శ్రీధర్‌బాబులు మంగళవారం రంగంలోకి దిగగా, సోమవారం మంత్రి శ్రీధర్ బాబు, విప్‌లు ధర్మపురి వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయి తొందరపడద్దని బుజ్జగించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News