Sunday, September 29, 2024

సమీపస్తున్న కేంద్ర గనుల శాఖ గడువు

- Advertisement -
- Advertisement -

కేంద్ర గనుల శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన గనుల వేలం గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 30లోగా కనీసం ఆరు గనులకు వేలం నిర్వహించాలన్న గడువు సమీపిస్తున్నా తెలంగాణ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. ఇంత వరకు అధికారికంగా ప్రభుత్వం ఏం చేయబోతోందనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు ఢీల్లీ టూర్‌లో ఉన్నందున ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గనులను వేలం వేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదిపత్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఈ గనులను ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించాలని కోరుతూ కేంద్రానికి ఒకటి రెండు రోజుల్లో లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి గడువు నిర్ణయిస్తూ జూన్ 30వ తేదీలోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఏ ఒక్క మినరల్ బ్లాక్‌కు తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించలేదని కేంద్ర గనుల శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులోగా కనీసం ఆరు బ్లాకులకైనా వేలం నిర్వహించాలని సూచించింది.

లేదంటే కేంద్రమే ఆ ప్రక్రియను పూర్తి చేస్తుందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 11 బ్లాకుల జియోలాజికల్ నివేదికలను అందించాయి. ఈ 11 బ్లాకుల్లో ఐదు ఇనుప ఖనిజం, ఐదు సున్నపురాయి, ఒక మాంగనీస్ బ్లాకు ఉన్నట్టు వెల్లడించాయి. ఖనిజాల బ్లాక్‌ల వేలం ప్రక్రియ 2015లో ప్రారంభం కాగా 2021లో ఇందుకు సంబంధించిన కొన్ని నిబంధనలను సవరించారు. వాటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట గడువులోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే వాటిని నిర్వహించే అధికారం కేంద్రానికి సంక్రమిస్తుందని పేర్కొంది. కొత్త విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా 354 ప్రధాన మినరల్ బ్లాక్‌లను వేలం వేశారు. వేలం అనంతరం వాటిలో 48 చోట్ల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. తద్వారా ఆయా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం వీటి వేలం విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండడం వల్ల ఆదాయం తగ్గడంతోపాటు సాంకేతికంగానూ ఇబ్బందులు ఎదురవుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందు చూపులేకుడా అప్పుడు గనులను వేలం వేసుకునేందుకు అనుకూలంగా సమమ్మతిని తెలియజేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది మే 20నే కేంద్ర గనుల శాఖ రాష్ట్ర గనుల శాఖకు లేఖ రాసింది. తెలంగాణలో గుర్తించిన 11 గనులకు వేలం వేయాలని పేర్కొంది. ఈ 11 గనులు సూర్యాపేట జిల్లాలోని సైదుల నామా, సుల్తాన్‌పూర్, పసుపులబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలతండ, ఆదిలాబాద్ జిల్లాలోని కంపాజునాపాని సున్నపురాయి గనులకు వేలం నిర్వహించాలని కేంద్రం రాసిన లేఖలో స్పష్టం చేసింది. అయితే ఈ పదకొండు గనుల్లో ఆరు గనులను వేలం వేయాలా..? వద్దా అనే అంశంపై ఇప్పుడు తర్జనభర్జన పడుతోంది. ముందుగా కేంద్రానికి లేఖ రాసి గనుల వేలం వేయకుండా వాటిని ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించేలా చూడాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు కేంద్రం అంగీకరించకపోతే తెలంగాణలోని మేజర్, మైనర్ మినరల్ బ్లాకులను వేలం పద్ధతిలో కేటాయించేందుకు గనులశాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఖనిజాల వారీగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్టు చెబుతున్నారు. ఇందులోమూడు సున్నపురాయి బ్లాకులు కాగా, మరో 12 చిన్న తరహా ఖనిజాలు ఉన్నాయి. సీఎం ఆమోదం రాగానే వేలం ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర గనుల శాక భావిస్తోంది. వేలంలో ద్వారా అర్హత సాధించిన వారికి ఆయా గనులను 20 ఏళ ్లపాటు లీజుకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగానే స్పందించే అవకాశం ఉంది. గనుల వేలం ద్వారా రాయల్టీగా రావాల్సిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా కోల్పోయిందని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్వాకం ఇందుకు కారణమని చెబుతున్నా, ప్రస్తుత ప్రభుత్వం కూడా రాయల్టీ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళిక లేకుండా ముందుకు పోతోందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News