రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని శంకరాపూర్ గ్రామానికి చెందిన చెన్నకేశవ, కమలమ్మ, లక్ష్మయ్య దంపతుల పేరిట ఘన్సీమియాగూడ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 4/7 4/8 లో గల 8 ఎకరాల భూమి ఉంది. తమ భూమిని ధరణి నుంచి తొలగించారని 9 నెలల క్రితం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చారు.
అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో కమలమ్మ కుమారుడు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్ నాగమణి మాట్లాడుతూ…ఆ రైతు కుటుంబం ఇచ్చిన దరఖాస్తు పరిశీలనలో ఉందని, ధరణిలో వారి భూమి వివరాల తొలగింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.