Friday, November 22, 2024

ఫిరాయింపులు ఆగేదెన్నడు?

- Advertisement -
- Advertisement -

‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు’ అన్న సుమతీ శతక నానుడికి తగ్గట్టు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు సాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతుండడం పరిపాటిగా మారింది.ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. దేశం మొత్తం మీద ఇదే ధోరణి కొనసాగుతోంది. ఈ ఫిరాయింపుల వల్ల అంత వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఒక ప్రభుత్వాన్ని కూలదోసి మరో దానికి ఊపిరి పోయడానికి ఎంఎల్‌ఎలు తాము ఎన్నికైన పార్టీని విడిచిపెట్టి కొత్త పార్టీలో చేరి ఫిరాయింపులకు పాల్పడినప్పుడు రాజ్యాంగం 10వ షెడ్యూల్ కింద అటువంటి వారి శాసన సభ్యత్వాల రద్దును కోరుతూ దరఖాస్తులు పెట్టుకోడానికి అవకాశం ఉంది. ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.

కానీ స్పీకర్ పాలక పక్షంలో భాగమైపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా స్పష్టం చేయలేదు. అందువల్ల స్పీకర్ విచక్షణకే ఇది మిగిలిపోతోంది. మహారాష్ట్రలో శివసేన వర్గాల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యాన్ని గమనించి చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అనూహ్యంగా అధికారంలో ఉన్న పార్టీల శాసన సభ్యులను ఏదో విధంగా ప్రలోభపెట్టి చీల్చడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు అధికార పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడం అగ్నిపరీక్ష అవుతోంది. కొన్నిసార్లు రిసార్టుల్లో దాచి ఉంచవలసి వస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ఇవన్నీ అనుభవాలే. ఏదో ఒక ప్రలోభంతో కొందరు ఫిరాయింపులకు పాల్పడితే మరికొందరు తమపై ఉన్న కేసులు మాఫీ కోసం అధికార పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్ విశ్లేషణ ప్రకారం అవినీతి ఆరోపణల పాలైన దాదాపు 25 మంది ప్రఖ్యాత రాజకీయ నేతలు 2014 నుంచి కేసుల్లో ఇరుక్కోవడంతో వారంతా బిజెపిలోకి ఫిరాయించినట్టు వెల్లడైంది. వీరిలో కాంగ్రెస్ నుంచి 10 మంది, ఎన్‌సిపి, శివసేన నుంచి నలుగురేసి వంతున, టిఎంసి నుంచి ముగ్గురు, తెలుగుదేశం నుంచి ఇద్దరు, ఎన్‌పి నుంచి ఒకరు, వైసిపి నుంచి ఒకరు బిజెపిలోకి ఫిరాయించారు. ఈ లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే ఆరుగురు నేతలు బిజెపిలోకి మారిపోవడం విశేషం. ఇటీవల పార్టీ ఫిరాయింపుల జోరు తెలంగాణ లోని బిఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి)లో ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికి ఐదురుగు బిఆర్‌ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, మరికొందరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని బిఆర్‌ఎస్ కోల్పోయిన తరువాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం సంభవించడంతో పార్టీ పరిస్థితి సంక్షోభంలో పడిందనే చెప్పవచ్చు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ఉన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోవడం అనూహ్య పరిణామం. పార్టీని విడిచిపెట్టి అనేక మంది కాంగ్రెస్ లేదా బిజెపి లోకి చేరుతున్నారు. అత్యంత సన్నిహితులైన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ వంటివారు కాంగ్రెస్ లోకి చేరడం బిఆర్‌ఎస్‌కు పెద్ద షాక్. ఈ పరిస్థితుల్లో ఫిరాయింపులను అడ్డుకోవడానికి హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ యోచిస్తున్నారు.అలాగే పార్టీ కేడర్‌లో భరోసా నింపడానికి ప్రయత్నిస్తున్నారు. 1960లో మొదలైన సంకీర్ణ రాజకీయాల పెరుగుదల, మంత్రివర్గంలో చోటు దక్కించుకోడానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయించడం ఎక్కువైంది. 1967లో ఒక శాసన సభ్యుడు గయాలాల్ ఒక రోజులోనే మూడు సార్లు ఫిరాయించి ఆయారామ్ గయారామ్ అనే అపఖ్యాతికి అంకురార్పణ చేశాడు.

ఈ ఫిరాయింపులను నివారించడానికి 1967లో నాల్గవ లోక్‌సభ సమయంలో వైబి చవాన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ 1968లో ఒక నివేదికను సమర్పించింది. ఇది పార్లమెంట్‌లో ఫిరాయింపుల నిరోధక బిల్లును సమర్పించడానికి మొదటి ప్రయత్నానికి దోహదం చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టం అవసరమన్న ప్రజాభిప్రాయం పెరగడంతో 1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో కొత్త ఫిరాయింపుల నిరోధక బిల్లును ప్రతిపాదించారు. అనేక చర్చల తరువాత 1985 జనవరి 30, 31 తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించాయి. 1985 ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోద ముద్రవేశారు. 1985 మార్చి 18న ఈ చట్టం అమలులోకి వచ్చింది. రాజ్యాంగానికి 52వ సవరణ ద్వారా 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం ఏర్పడింది.ఈ చట్టాన్ని మరింత ప్రభావంతం చేయడానికి 2003 లో సవరణ కూడా జరిగింది. ఇలా ఎన్ని నిబంధనలను సవరించి చట్టాన్ని పటిష్టం చేసినా ఫిరాయింపుల పీడ విరగడ కావడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News