న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం లోక్‌సభలో చర్చను ప్రారంభించే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి. జులై 2న ప్రధాని నరేంద్ర మోడీ దర్చకు సమాధానమిస్తారని వారు చెప్పారు.
ఈ తీర్మానంపై చర్చను బిజెపి సభ్యుడు సుధాంశు త్రివేది శుక్రవారం రాజ్యసభలో ప్రారంభించే అవకాశం ఉంది. జులై 3న ప్రధాని మోడీ రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తారని వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ సాంప్రదాయాలు, నిబంధనల ప్రాకరం పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించిన అనంతరం ఇందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ లోక్‌సభ, రాజ్యసభ విడివిడిగా తీర్మానాలను ఆమోదించాల్సి ఉంటుంది.
ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా ఉభయ సభలలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల దాడి జరిగే అవకాశం కనపడుతోంది. 18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షం బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఈ చర్చలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజి, యుజిసి నెట్ పరీక్ష రద్దు వంటివి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ఎమర్జెన్సీపై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షం ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. జులై 3న పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.