Friday, December 20, 2024

లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టే యత్నం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో నెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎంఎల్‌ఎలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నేతలు, బొగ్గు, గని కార్మిక సంఘం నేతలతో తెలంగాణ భవన్‌లో కెటిఆర్ గురువారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సింగరేణిని ప్రైవేటీకరిం చేందుకే తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని వెల్లడించారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తు న్నారన్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపిలు కుమ్మక్కై నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోందని పేర్కొన్నారు.

కెసిఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నుంచే పనిచేస్తున్నారన్నారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందని తెలిపారు. సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమైనాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు గొప్పగా పనిచేయని వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థల బలోపేతం అనేది మన పార్టీ విధానమన్నారు. ఉద్యమ కాలం నుంచి, ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే మా విధానమని, అందుకే ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చిన పక్కకు పెట్టి, రైతు బీమాను ఎల్‌ఐసికి ఇచ్చామని, విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బిహెచ్‌ఇఎల్‌కి అప్పగించామని కెటిఆర్ గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లపాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పనిచేశామో ప్రతీ సింగరేణి కార్మికునికి అవగాహన ఉందన్నారు. కెసిఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలకు పైగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డకున్నామని కెటిఆర్ గుర్తు చేశారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు వారాలు కాకముందే బిజెపి ఎంపిలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలంకు పెట్టాయి. తెలంగాణ గొంతుక పార్లమెంట్‌లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బిజెపిలు ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి సింగరేణిని బలోపేతం చేసిందే బిఆర్‌ఎస్ అని అన్నారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుం దన్న విషయం మర్చిపోతున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటాం అని కెటిఆర్ పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News