Monday, December 23, 2024

నీట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నీట్ వైద్య ప్రవేశ పరీక్షపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, సంప్రదాయాన్ని, సభ గౌరవాన్ని ముందు పాటించాలని, ఆ తరువాత అది జరుగుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం స్పష్టం చేశారు. నీట్ యుజి నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై చర్చ కోరుతూ ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో శుక్రవారం లోక్‌సభ వాయిదాపడిన తరువాత మంత్రి ప్రధాన్ విలేకరులతో మాట్లాడుతూ, విద్యార్థులను గందరగోళానికి గురి చేయవద్దని ఆ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

‘ప్రభుత్వం ఏ విధమైన చర్చకైనా సిద్ధమే. అయితే, నిబంధనలు, సభ గౌరవం పాటించిన తరువాత ప్రతిదీ జరుగుతుంది. రాష్ట్రపతి గురువారం తన ప్రసంగంలో ఆ పరీక్ష గురించి మాట్లాడారు. దేనినైనా ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని ఆ ప్రసంగం సూచించింది’ అని పార్లమెంట్ వెలుపల విలేకరులతో మంత్రి చెప్పారు.

దేశ యువత, విద్యార్థుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో ఉన్నదని ఆయన తెలిపారు. ‘తన వైఖరిని స్పష్టం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు గందరగోళం ఎందుకు? మేము అత్యంత కఠిన చర్య తీసుకోబోతున్నాం. సిబిఐ (ప్రమేయం ఉన్న) ప్రతి ఒక్కరినీ పట్టుకోబోతున్నది. మేము ఎవ్వరినీ వదలిపెట్టబోము’ అని ప్రధాన్ స్పష్టం చేశారు. నీట్ యుజి పరీక్షను ఎన్‌టిఎ మే 5న నిర్వహించగా సుమారు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను ఈ నెల 4న ప్రకటించారు. పరీక్షలో అవకతవకల గురించి, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్న పత్రం లీకుల గురించి దాదాపు ఆ వెంటనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘మేము ఎవ్వరినీ వదలిపెట్టబోవడం లేదు. ఎన్‌టిఎ అధిపతిని తొలగించాం. ఆ బాధ్యతను సీనియర్ అధికారులకు అప్పగించాం. ఇదంతా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.

విద్యార్థులను అయోమయానికి గురి చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేయదలిచాను’ అని ప్రధాన్ చెప్పారు. ‘సంస్కరణల కోసం విశ్వసనీయమైన ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటైంది. త్వరలోనే ఆ (వాయిదా పడిన లేదా రద్దు అయిన) పరీక్షలు అన్నిటి తేదీలు కూడా ప్రకటిస్తాం. చర్చలో పాల్గొనవలసిందిగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని మంత్రి చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు లోక్‌సభ 16 గంటలు కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం చర్చకు సమాధానం ఇవ్వవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News