కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్.. రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డీ శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2024, జూన్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.