న్యూఢిల్లీ : చిన్ననాటి మిత్రులు ఇద్దరు దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా మారారు. వీరు మరెవరో కాదు, దేశం లోని ఆర్మీ, నేవీ అధిపతులు. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి భారత నౌకాదళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దినేష్ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది 1970 లో మధ్యప్రదేశ్ రేవా లోని సైనిక్ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. నాటి నుంచే వారిద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఉంది.
ప్రస్తుతం వారు వేర్వేరు దళాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ పరస్పరం సలహా సంప్రదింపులు జరుపుతుంటారు. రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ “ ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను మిలటరీ అత్యున్నత సేవలు అందించగలిగే అధికారులుగా తీర్చి దిద్దిన అరుదైన గౌరవం రేవా లోని సైనిక్‌స్కూల్‌కు దక్కుతుంది” అని అభినందించారు. 1964 జులై 1 న జన్మించిన లెఫ్ట్ నెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15న సైన్యంలో చేరారు. అనంతరం వివిధ కీలక పోస్ట్‌ల్లో పనిచేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘకాలం సేవలు అందించారు.
జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ
ఆర్మీ చీఫ్‌గా రెండేళ్లు దేశానికి సేవలందించిన జనరల్ మనోజ్‌పాండే ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన్ను గార్డ్ ఆఫ్ హానర్‌తో అధికారులు గౌరవించారు. పాండే 2022 ఏప్రిల్ 30న ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. వాస్తవానికి ఆయన మే 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీస్‌ను ఒక నెల పొడిగించింది. దీంతో జూన్ 30న పదవీ విరమణ చేశారు.