న్యూఢిల్లీ: నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్‌డిఎ) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరగనున్నది. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల కాలంలో ఎన్‌డిఎ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి ప్రసంగించే అవకాశం ఉంది. తన మూడు పదవీ కాలాలలో తమ నాయకుడిగా తనను ఎన్నుకున్న సందర్భాలలో ఎన్‌డిఎ ఎంపీలను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించినప్పటికీ ఆయన సాధారణంగా బిజెపి సమావేశాలలోనే పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు.
మంగళవారం జరగనున్న సమవేశంలో పాల్గొనవంలసిందిగా బిజెపితోపాటు మిత్రపక్షాల ఎంపీలను కూడా ఆహ్వానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపి సొంతంగా మెజారిటీని సాధించలేకపోవడం, మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో మంగళవారం జరగనున్న ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ ఎన్నికలలో బిజెపికి 240 సీట్లు దక్కగా దాని మిత్రపక్షాలకు 53 సీట్లు లభించాయి. 543 ఎంపీలతో కూడిన లోక్‌సభలో ఎన్‌డిఎ కూటమి మెజారిటీ సంపాదించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని మోడీ పార్లమెంట్ ఉభయ సభలలో సమాధానం ఇవ్వనున్నారు.