న్యూఢిల్లీ :ఇతర దేశాల నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి చదువుకొనే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను ఆ దేశం భారీగా పెంచేసింది. గతంలో 473 అమెరికన్ డాలర్లుగా ఉన్న ఫీజును ఇప్పుడు 1,068 డాలర్లకు పెంచింది. జులై 1 వ తేదీ నుంచి ఇది అమలు లోకి వచ్చింది. వలసలను బలవంతంగా నియంత్రించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం అక్కడికి ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడేవారి సంఖ్య ఆల్‌టైమ్ హైలో ఉంది. ఫలితంగా ఇది గృహమార్కెటింగ్ రంగంపై ప్రభావం చూపిస్తోంది.
ఇక టెంపరరీ గ్రాడ్యుయేట్, విజిటర్, మారిటైమ్ క్రూ, వీసాలు ఉన్నవారు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా విద్యార్థి వీసాకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ప్రస్తుతం ఆ దేశంలో నివాసం ఉంటున్న వేల మంది భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. “ నియమాల్లో ఈ మార్పులు మొత్తం నేటి నుంచి (జులై 1) అమల్లోకి వస్తాయి. మా అంతర్జాతీయ విద్యావిధానం మరింత బలంగా మారేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నాం. కేవలం దేశాన్ని బలోపేతం చేసేలా ఈ చర్యలు చేపట్టాం” అని ఆ దేశ హోం సెక్రటరీ క్లారె ఓనెయిల్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో కేవలం అసలైన విద్యార్థులు వీసాలు పొందేలా, దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఊతమిచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
దీనికి తోడు వీసా వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకొంటూ విదేశీ విద్యార్థులు అక్కడే ఉండిపోవడాన్ని ఇది నిరోధిస్తుంది. ఆ దేశ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం 2023 సెప్టెంబర్ 30తో ముగిసే ఏడాది కాలంలో 5,48,000 మంది వలస వచ్చారని పేర్కొంది. ఇక భారత్ నుంచి ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో 2022 ఒక్క సంవత్సరమే 1,00,009 మంది రిజిస్టర్ అయ్యారు. ఇక జనవరి 2023 నుంచి సెప్టెంబర్ వరకు 1.22 లక్షల మంది విద్యార్థులున్నారని లెక్కలు చెబుతున్నాయి. అమెరికా, కెనడాతో పోలిస్తే ఆస్ట్రేలియా విద్యార్థి వీసా మరింత ఖరీదైంది. ఆయా దేశాల్లో 185 డాలర్లు, 110 డాలర్లు కాగా, ఆస్ట్రేలియాలో 1,068 డాలర్లుగా ఉంది.