ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ వచ్చిందని సిఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పింఛన్లకు రూ.4,408 కోట్లు ఖర్చు చేయడం చరిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ని పెనుమాక ఎస్‌టి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ అందించారు. నాయక్ కూతురు ఇస్లావతి బాయికి వితంతు పెన్షన్, పాములు నాయక్‌కు వృద్ధ్యాప్య పెన్షన్,
భార్య సీతా బాయికి రాజధాని పరిధిలో భూమిలేని వారికి ఇచ్చే వ్యవసాయ కూలీ పెన్షన్ అందజేశారు. అనంతరం నాయక్ కుటుంబ సభ్యులతో ముచ్చటించిన సిఎం చంద్రబాబు వారికి ఇల్లు లేదని తెలుసుకొని స్పందించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వెంటనే అధికారులను ఆదేశించారు. ఎస్‌టి వాడలోనే తిరిగి స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మసీదు సెంటరులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు, ప్రజలతో సిఎం చంద్రబాబు ముచ్చటించారు.
పోలవరంపై వారివి అడ్డగోలు వాదనలు
“పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్ ను నాడు జర్మన్ కంపెనీ టెక్నాలజీతో కష్టపడి రెండు సీజన్లలలోనే నిర్మించాం. కానీ గత ప్రభుత్వం రెండేళ్లపాటు పట్టించుకోకపోవడంతో వరదల వల్ల డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. రూ.440 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మిస్తే గత పాలకుల నిర్వాకం వల్ల దెబ్బతింది. కొత్తది మళ్లీ ఇప్పుడు నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని పరిశీలించేందుకు ఇప్పుడు విదేశాల నుండి నిపుణులు వస్తున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.600 కోట్లు మిగిల్చామని గత పాలకులు చెప్పారు..కానీ జరిగిన నష్టం రూ.70 వేల కోట్లు…అది రూ.లక్షల కోట్లకు కూడా పెరుగుతుంది. దుర్మార్గులు గోదావరిలో పోలవరంను ముంచారు మళ్లీ ఇప్పుడు అడ్డగోలు వాదనలకు దిగుతున్నారు” అని సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యాచారాలకు పాల్పడితే అదే చివరిరోజు
“దళిత కుటుంబానికి చెందిన, గత ప్రభుత్వంలో బాధిత మహిళగా ఉన్న వంగలపూడి అనితను హోంమంత్రిని చేశాం. ఆడబిడ్డల జోలికి ఎవరొచ్చినా మదంతో ప్రవర్తిస్తే ఎవరినీ వదిలిపెట్టను. ఎవరు అత్యాచారాలకు పాల్పడ్డా అదే చివరి రోజు అవుతుంది. పాలన ప్రారంభమైంది ఈ మధ్యనే కాబట్టి ఇప్పటిదాకా మర్యాదగా చెప్పా. మద్యం, గంజాయి మత్తులో ఏదిపడితే అది చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని తెలిస్తే. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టను.” అని సిఎం చంద్రబాబు హెచ్చరించారు.
మరోసారి పరదాలు కనబడితే సస్పెండే
“నేను వెళ్లే దారుల్లో పరదాలు కట్టినట్లు మళ్లీ కనబడితే సస్పెండ్ చేస్తా. అధికారులు కూడా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజుల్లోకి రావాలి. కొత్త శకానికి, కొత్త పాలనకు అందరూ అలవాటు పడాలి. పరదాలు కట్టాలన్న ఆలోచన వస్తే ఇక షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. చెప్పిన దాని ప్రకారం నడుచుకోకపోతే మళ్లీ 1995 నాటి సిఎంను చూస్తారు. తప్పు చేస్తే ఎవర్నీ వదలను. ఎప్పుడూ జరగని అభివృద్ధిని మంగళగిరి నియోజకవర్గంలో చేసి చూపిస్తాం.
రోడ్లు వేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాతో చెప్పండి. కోర్టులకు వెళితే పనులు ఆలస్యమవుతాయి. మా ప్రభుత్వం నిరంతరం మీ కోసమే ఆలోచిస్తుంది. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు అమలు చేయడానికి, పేదరికం లేని సమాజానికి పెనుమాక నుండే సంకల్పం తీసుకుంటున్నాం. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి వాడిని కాదు. మీ గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించడానికి పనిచేస్తా. కొన ఊపిరి వరకూ ప్రజల కోసమే పోరాడుతా” అని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు.