హైదరాబాద్: రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాధనలు ప్రభుత్వ పరిశీలనకు వెళ్ళాయి. ఇటీవల స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి బుద్ద ప్రకాష్ మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో వచ్చిన ప్రతిపాదనలపై ఆ శాఖ అధికారులతో సమీక్షించి క్షేత్ర స్థాయి ప్రతిపాదనలపై అన్ని కమిటీల ఆమోదం తీసుకున్నారు. అనంతరం ఈ ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వ పరిశీలనకు పంపారు.
ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలపై పునఃసమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి ప్రభుత్వ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై ఒకటినాడే పెంచిన ప్రతిపాదనలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి జులై 15 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలలో హెచ్చు తగ్గులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.