Sunday, November 24, 2024

15ఏళ్లు అధికారంలో ఉంటాం: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

అధికారంలో ఉన్నా లేకపోయినా జనం కోసం పనిచేసే వాళ్లే
నిజమైన నాయకులు బిఆర్‌ఎస్
జడ్‌పి చైర్మన్లతో కెసిఆర్ ఆత్మీయ సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ఈ సారి మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని బి.ఆర్.ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. గతంలో ఎన్‌టిఆర్ పాలన తర్వాత మళ్లీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ జెడ్‌పి చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జెడ్‌పి చైర్మన్లు అందరూ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని అన్నారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని పేర్కొన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తున్నదని చెప్పారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు.

పార్టీ నాయకులను సృష్టిస్తుంది..కానీ నాయకులు పార్టీని సృష్టించరు
పార్టీ నాయకులను సృష్టిస్తుంది కాని నాయకులు పార్టీని సృష్టించరని, మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తామని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా..? అని ప్రజలే అసహించు కుంటున్నారని అన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కొంచెం సమన్వయంతో ఓపిక పట్టాలని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని అన్నారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పారు.

బిఆర్‌ఎస్ బి. ఫామ్ ఎవరికి దక్కితే వాళ్లదే విజయం
తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉన్నదని ఈ సారి బిఆర్‌ఎస్ తరపున ఎవరికి బి. ఫామ్ దక్కితే వాళ్లదే విజయమని కెసిఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామన్నారు. బంగ్లాదేశ్‌లో హష్మీ అనే ఒక ప్రొఫెసర్ పేద మహిళల కోసం 71 వేల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న విధానం గురించి, జీరో పొల్యూషన్ నగరాల్లో అక్కడి మేయర్లు ప్రజల్లో మమేకమైన విధానం గురించి కెసిఆర్ వివరించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ జెడ్‌పి చైర్మన్లను పేరు పేరునా పలకరించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జెడ్‌పి చైర్మన్లు కుటుంబ సభ్యులతో వారి యోగక్షేమాలను చర్చిస్తూ ఎక్కువ సేపు గడిపారు. సమావేశం అనంతరం జెడ్‌పి చైర్మన్లందరికీ యాదాద్రి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధినేత కెసిఆర్‌ను కలవడం సంతోషంగా ఉందని జెడ్‌పి చైర్మన్లు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. జెడ్‌పి చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీష్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News