Friday, January 3, 2025

6న తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

జూలై 6న తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ
హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా చర్చలు
ఏర్పాట్లు చేస్తోన్న అధికార యంత్రాంగం
అజెండా సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామన్న ఏపీ సీఎం
విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు
రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సి ఉందన్న ఏపీ సీఎం

మన తెలంగాణ/అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు రాసిన లేఖకు సిఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈనెల 6న జరిగే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సహచర మంత్రులు, ఉన్నతాధికారులతో ఈ విషయంపై సిఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలివే…
పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్ధిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్థులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయం వంటి 30 సంస్థల ఆస్థులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైనా వివాదాలున్నాయి. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చొరవ చూపడంతో రెండు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.

విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం: రేవంత్‌రెడ్డి

విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ ఈమేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా చర్చిద్దామని ఆహ్వానించారు. విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం. తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరం. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. మా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున చంద్రబాబును ఆహ్వానిస్తున్నాం అని రేవంత్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నెల 6న హైదరాబాద్‌లో కలుద్దాం…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశమవుదామని ప్రతిపాదన చేశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు.

రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఇచ్చిన విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకోవడమే మంచిదన్నారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతోందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News