Friday, December 20, 2024

ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అన్ని విభాగాలలో సందడి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు వివిధ శాఖల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. జులై 5(గురువారం) నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 జూన్ 30 నాటికి నాలుగేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్దేశిత తేదీ నాటికి రెండేళ్లు దాటని వారిని బదిలీ చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.

2025 జూన్ 30లోగా పదవీ విరమణ చేసే వారిని బదిలీ చేయవద్దని ఉత్తర్వుల్లో తెలిపింది. జులై 5 నుంచి 8 వరకు ఖాళీలు, బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు వెల్లడించనున్నట్లు సర్కారు వివరించింది. జులై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. జులై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలన చేయనున్నట్లు స్పష్టం చేసింది. జులై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జులై 21వ తేదీ నుంచి మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఈ కేటగిరీ ఉద్యోగులకు బదిలీల్లో తొలి ప్రాధాన్యం
ఉద్యోగ దంపతులకు 70 శాతం అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులకు,వితంతువులకు బదిలీల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మానసిక స్థితి సరిగాలేని పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి బదిలీ ఇవ్వాలి. అలాగే, ఉద్యోగికి కాని, భార్య లేదా భర్త, లేదా పిల్లలు, తల్లిదండ్రులకు క్యాన్సర్ న్యూరోసర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టిబి వంటి అనారోగ్య సమస్యలు ఉంటే ఆ జబ్బులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి బదిలీ ఇవ్వాలి.

ఉద్యోగుల బదిలీల షెడ్యూల్

జులై 5 నుంచి 8 వరకు ఖాళీలు, బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు వెల్లడి
జులై 9 నుంచి 12 వరకు ఉద్యోగులు ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం
జులై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలన
జులై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీల బదిలీల ఉత్తర్వులు జారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News