కొత్త ప్రొటీన్‌ను తయారుచేసిన ఫిన్‌లాండ్ కంపెనీ
ఇందులో మనుషులకు అవసరమయ్యే అన్ని పోషకాలు
హెల్సింకి: ఆహార కొరతకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నది ‘సోలార్ ఫుడ్స్’ అనే ఓ ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్ సంస్థ. ఈ కంపెనీ ‘సొలీన్’ అనే ఒక ప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసింది. ఈ పౌడర్‌ను మనుషులు ఆహారంగా తీసుకోవచ్చని ఈ కంపెనీ చెప్తున్నది. ఈ ప్రొటీన్ పౌడర్‌ను గాలి, విద్యుత్తును ఉపయోగించి తయారుచేయడం విశేషం. ఫిన్‌లాండ్‌లోని నేషనల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ కొత్త ఆహారాన్ని కనుగొన్నట్టు సోలార్ ఫుడ్స్ సిఈవో డాక్టర్ పసి వైనిక్కా తెలిపారు. హైడ్రోజెన్(హెచ్2), కార్బన్ డయాక్సైడ్ ద్వారా పెరిగే ఒక రకమైన సూక్ష్మజీవితో ఈ ప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసినట్టు చెప్పారు. విద్యుత్తు ద్వారా హెచ్2, గాలి ద్వారా కార్బన్ డయాక్సైడ్ అందించి ట్యాంకుల్లో ఈ సూక్ష్మజీవిని పునరుత్పత్తి చేసిన్నట్టు తెలిపారు.
ఈ సూక్ష్మజీవినే ఎండబెట్టి పౌడర్ చేస్తామని, పసుపు రంగులో ఉండే ఈ ప్రొటీన్ పౌడర్‌లో మానవ శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు, అమినో యాసిడ్లు ఉంటాయని చెప్పారు. ఎండిన మాంసంలో ఉండే పోషకాలే దాదాపుగా ఇందులో కూడా ఉంటాయని తెలిపారు. పర్యావరణ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న సంప్రదాయ ఆహార ఉత్పత్తి పద్ధతులకు ఈ కొత్త ప్రక్రియ ప్రత్యామ్నాయంగా మారుతుందని ఈ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎడారులు, మంచు ప్రదేశాలు సహా ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పౌడర్‌ను తయారుచేయవచ్చని తెలిపింది. మొక్కల ద్వారా చేసే ఆహార ఉత్పత్తితో పోలిస్తే కేవలం ఒక్క శాతం నీటితో, ఐదు శాతం భూవిస్తీర్ణంలో సొలీన్ ప్రొటీన్‌ను తయారుచేయవచ్చని ప్రకటించింది.